మక్తల్, జూలై 17: ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు. దీంతో తెల్లవారుజాము నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పడగాపులు ఉంటున్నారు. ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగుకు అవసరమైన యూరియా కోసం రైతన్నలు నిత్యం మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలోనే యూరియా దొరకకపోవడంతో పంట సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరెంటు కష్టాలతో సతమతమవుతున్న తమకు ఎరువుల కోసం కూడా కార్యాలయం వద్ద పడిగాపులు తీయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నాయకులు మాత్రం రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప, రైతులకు కావలసిన ఎరువులను అందించడంలో ఘోరంగా విఫలం అయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రజా పాలన పేరిట నాయకులు ప్రసంగాలను చేస్తూ మోసపూరితమైన హామీలు ఇస్తున్నారు తప్ప రైతులకు కావలసిన ఎరువులను అందించడంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. వరి నాట్లు వేసే సమయంలో ప్రభుత్వం రైతులకు అందించాల్సిన ఎరువులను సకాలంలో అందించకపోవడం వల్ల నాట్లు వేసే సమయం ఆలస్యం అవుతుందని, దీంతో పంట దిగుబడిలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు ఇలాంటి దుస్థితి రాలేదని, ఎప్పటికప్పుడు ఎరువులు అందడంతో పాటు సకాలంలో మాటలను వేసుకునే వారమని, ప్రస్తుతం కరెంటుతో పాటు, ఎరువులకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతన్నలు చెప్పారు.