ఊట్కూర్, జూలై 14 : ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుల కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వరుణదేవుడు ముఖం చాటేయడంతో పొలాల్లో పచ్చదనం కరువై, రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. వర్షాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న రైతులు చివరకు దైవాన్ని ఆశ్రయించారు. నారాయణపేట జిల్లా
ఊట్కూర్ మండల కేంద్రం దంతన్‌పల్లి శివారులోని ప్రసిద్ధ మూకి బసవేశ్వర ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ రైతులు, భక్తులు డప్పుల మోతతో ఆలయానికి చేరుకుని శివుడికి జలాభిషేకం చేశారు. అనంతరం ఆలయాన్ని జలదిగ్బంధనం చేసి, వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించారు.
ప్రస్తుతం మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసిన పత్తి, కంది, ఆముదం పంటలు నీరందక ఓడుముఖం పడుతున్నాయి. మొక్కలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి అనుకూలించాలని, పంటలు కాపాడాలని కోరుతూ భజనలు, పూజలతో వరుణదేవుడిని వేడుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న అరుదైన దృశ్యంగా మారింది.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “రైతు బతికితేనే ఊరు బతుకుతుంది. మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని భగవంతుడిని వేడుకున్నాం” అని తెలిపారు.