మరికల్, సెప్టెంబర్ 4: నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలోని తీలేరు సహకార సంఘానికి గురువారం 900 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అయితే యూరియా దొరకని రైతులు లాల్కోట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ రాము, మండల వ్యవసాయ అధికారి రహమాన్ రైతులతో మాట్లాడి అందరికీ యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు. అనంతరం రైతులను క్యూలో నిలబెట్టిన పోలీసులు.. ఎన్నికల్లో సిరా గుర్తు పెట్టినట్టుగా వారికి సిరా గుర్తు పెట్టి టోకెన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ రాములు మాట్లాడుతూ.. రైతులు మళ్లీ మళ్లీ రాకుండా సిరా గుర్తు పెట్టి, టోకెన్లు పంపిణీ చేశామన్నారు.