ఊట్కూర్(కృష్ణ ), మార్చి 30: నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబడ్లూరులో విషాదం నెలకొంది. అప్పుల బాధతో కృష్ణా నదిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుడేబడ్లూరు టై రోడ్డు చెక్‌పోస్టు వద్ద నివాసం ఉండే నాగరాజు (55) కృష్ణా పరివాహక ప్రాంతంలో భూమి కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా ఆశించినంతగా వరి పంట దిగుబడి రాలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో నిరాశకు లోనైన నాగరాజు.. ఈ సీజన్లో పంట వేయలేదు. సాగు కోసం చేసిన అప్పుల తీర్చేందుకు, పొట్ట కూటి కోసం హైదరాబాద్ వచ్చాడు.
హైదరాబాద్‌లో చిన్నా చితకా పనిచేస్తున్న నాగరాజు.. రెండు రోజుల క్రితం భార్యాపిల్లలను చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కృష్ణ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పుల బాధ భరించలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాగరాజు భార్య పోలీసులకు తెలిపింది. కౌలు రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు.