మరికల్, ఏప్రిల్ 02 : తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను శిశు సంక్షేమ శాఖ అధికారులు అక్కున చేర్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..మరికల్ మండలంలోని గాజులయ్య తండాకు చెందిన డేగవత్ లక్ష్మి గత నెల 22న పొయ్యిల కట్టెల కోసం అడవికి వెళ్లగా పాముకాటుతో మృతి చెందింది. లక్ష్మీ కుమార్తె రేణుక, కుమారుడు మహేష్ బాబు నాయక్ అనాథలుగా మారారు. పది రోజులుగా తండావాసుల సంరక్షణలో ఉన్న వారిని తండా మాజీ ఉపసర్పంచ్ భాస్కర్ నాయక్ బుధవారం శిశు సంరక్షణ కమిటీ అధికారులకు అనాథల విషయం చేరవేశారు.
దీంతో వారు గాజులయ్య తాండాకు చేరుకొని పోలీసుల సమక్షంలో విచారణ జరిపి చిన్నారులను చేరదీశారు. నారాయణపేట జిల్లా శిశు సంక్షేమ శాఖ లీగల్ అడ్వైజర్ కవిత తండవాసులతో మాట్లాడి ఇద్దరు చిన్నారులను నారాయణపేటకు తీసుకెళ్లారు. అనాథలైన పిల్లల సంరక్షణ కోసం వారం రోజుల క్రితం సేకరించిన 27 వేల రూపాయలను సైతం అధికారికి తండావాసులు ముట్ట చెప్పారు. అనాథలను అక్కున చేర్చుకోవడంతో తాండావాసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.