Narayanapet | మరికల్, జూన్ 10 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
మంగళవారం మరికల్ మండలంలోని మాధవరం, చిత్తనూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో సమస్యల గురించి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూభారతి చట్టం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ రైతులకు సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి రసీదు ఇవ్వాలని సూచించారు. అనంతరం చిన్నచిన్న సమస్యలను రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని తాసిల్దార్, డీటీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామకోటి, డిటి బీబీ హజ్ర, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది రవి, విష్ణు, రమేష్, శివ, చరణ్, రైతులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.