Murder | కొల్లాపూర్ : పచ్చని సంసారంలో అనుమానమనే పెనుభూతం చిచ్చుపెట్టింది. సాఫీగా సాగుతూ వస్తున్న సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు వేరు కాపురాలు పెట్టగా.. చివరకు భర్త కలిసి ఉందామని నమ్మ బలికి.. దేవుడి దర్శనానికి వెళ్తామని చెప్పి భార్యను మృత్యు ఒడికి చేర్చాడో భర్త. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో జరిగింది. సాతాపూర్-మారేడుమాన్ దిన్నే గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో జరిగిన హత్య ఉదంతం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం 2014 సంవత్సరంలో మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన శ్రావణిని (27) ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు (11), కొడుకు (10) ఉన్నారు. అయితే, సవ్యంగా సాగుతున్న పచ్చని కుటుంబంలో గత కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య అనుమానం పెనుభూతంగా మారడంతో మనస్పర్థలు వచ్చాయి.
దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటూ వస్తున్నారు. శ్రావణి తన పిల్లలతో తల్లిదండ్రుల వద్ద ఉంటే శ్రీశైలం మాత్రం హైదరాబాద్‌లో ఉన్నాడు. అయితే, పథకం ప్రకారం భార్యను హత్య చేయాలని నిర్ణయించుకొని హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చి భార్యతో కలిసి మెలిసి ఉందామని నచ్చచెప్పాడు. ఇద్దరి మధ్య సమస్యలు పోవాలని.. సోమశిలలో ఉన్న ఆలయానికి వెళ్తామని చెప్ప శ్రావణిని నమ్మించాడు. దాంతో 21న భర్త శ్రీశైలంతో కలిసి శ్రావణి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. అయితే, మార్గమధ్యలో పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ వద్ద రూటు మార్చి మారేడుమాన్ దీన్నే గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. శ్రావణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భర్తతో వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోవడంతో మృతురాలి తండ్రి శ్రీను మహబూబ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. పోలీసులకు హత్య చేసిన ఘటనా స్థలాన్ని చూపించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.