పెద్దమందడి, మార్చి 28 : సింగిల్ విండో సొసైటీ ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకొని సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ద్వారా తీసుకున్న రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఆయన కోరారు. రుణాలు రెన్యువల్ చేసుకోవడం ద్వారా వడ్డీ తక్కువ పడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా దీర్ఘకాల రుణాలు తీసుకున్న వారు కూడా సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కొత్తగా క్రాప్ లోన్స్ జూన్ నెల నుండి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని మండలంలోని ఆయా గ్రామాలలో సొసైటీ ద్వారా సేకరిస్తామని తెలిపారు. సొసైటీ కేంద్రాల దగ్గరకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులు కవర్లపై ఆరబెట్టి తీసుకురావాలని ఆయన కోరారు. త్వరలోనే సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కావున రైతు సోదరులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాజా ప్రకాష్ రెడ్డి, నరేష్, వెంకటేశ్వర్ రెడ్డి, రామ్ రెడ్డి, రామ్ సింగ్ నాయక్, సీఈఓ జగదీశ్వర్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.