పెద్దకొత్తపల్లి, మార్చి 7: నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఇంట ఆడపడుచుల సందడితో గ్రామంలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో ప్రతి ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలతో పచ్చటి పల్లెటూరులో పండగ వాతావరణం బంధుగణంతో నిండుదనం సంతరించుకుంది. గ్రామంలోని గ్రామస్తులందరూ ఐకమత్యంతో శ్రీ వీరాంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణ విగ్రహాలతో పాటు పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరనున్న ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంత్రోచరణాల మధ్య ఘనంగా అంకురార్పణ జరిగింది.
గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు హోమం, అభిషేకాలు, ధ్వజస్తంభరోహణ కార్యక్రమాలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్టకు ముందు అత్యంత కీలక ఘట్టమైన వాస్తు పూజ, వాస్తు యాగము, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అరణీమథనం, అగ్ని ప్రతిష్టా, మూలమంత్రో హోమమ, పూర్ణాహుతి, తీర్థప్రసాదగోష్టి కార్యక్రమాలు కనుల పండుగ జరిగాయి. అగ్ని ప్రతిష్ట, హోమంలో అగ్నిజ్వాలలో దేవత మూర్తులు ప్రత్యక్షమైన ఆకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో భక్తులు ఆధ్యాత్మిక భావనతో తన్మయం చెందారు. ధ్వజ సంభ ప్రతిష్ట అనంతరం ప్రతి ఇంటి నుంచి వారి ఆడపడుచులకు ఒడిబియ్యం పెట్టి సాగనంపాలని వేద పండితులు గ్రామ ప్రజలకు తెలియజేశారు. అలాగే వీరాంజనేయ స్వామి విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలని అత్యంత బలశాలుడైన వీరాంజనేయ స్వామి గ్రామానికి గ్రామంలో ఎలాంటి పిశాచాలు ప్రవేశించకుండా అడ్డుకుంటాడని ఆధ్యాత్మిక చరిత్ర చెబుతున్నట్లు వేద పండితులు గ్రామ ప్రజలకు వివరించారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా పూజా కార్యక్రమాలలో గ్రామ ప్రజలతో పాటు సమీప గ్రామ ప్రజలు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట అనంతరం దర్శించుకున్న వారికి సౌభాగ్యం కలగడంతో పాటు స్వామి చల్లని చూపు ఎప్పుడు తోడుగా ఉంటుందని నానుడి ఉంది. శ్రీరామునిపై అత్యంత భక్తి విశ్వాసాలతో ఉండే శ్రీ వీరాంజనేయ స్వామి ఆధ్యాత్మిక చరిత్ర నేటి తరానికి ఆదర్శమని చెప్పవచ్చు. అంతరిస్తున్న మానవ విలువల నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతన సత్యం వైపు నడిపిస్తుందని మానవ విలువలను కాపాడుతుందని కుటుంబ బాంధవ్యాలను మెరుగుపరుస్తుందని పేద పండితులు గ్రామస్తులకు వివరించారు. అలాగే శ్రీ హనుమాన్ చాలీసా, హనుమాన్ చరిత్రను ప్రజల తెలియజేశారు. వేద పండితులు పూజా కార్యక్రమాలతో పాటు వేదమంత్రోచ్ఛరణలతో శ్రీ రామాయణం హనుమాన్ చరిత్రను భక్తులకు తెలియజేయడంతో భక్తులు ఆధ్యాత్మిక భావోద్వేగానికి లోనయ్యారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో వేదమంత్రోచ్ఛరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం వరకు జరిగే శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలను తిలకించేందుకు వస్తున్న భక్తుల రాకపోకలతో జగనాథాపురంలో సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు యువకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.