అమ్రాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జాతీయ గీతం లేకుండా మొదలు పెట్టారు. దాంతో స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. జిల్లా కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు సూచించారు.
ఇద్దరు మంత్రులు హాజరైన సభలో జాతీయగీతం ఆలపించకపోవడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రులు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెంచులను అక్కడికి పిలిపించి వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. దాంతో వారు ఎండలో చిన్న పిల్లలతో కూర్చున్న దృశ్యాలు కనిపించాయి.
దీనిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణ లోపంవల్లే ఇలాంటి తప్పులు దొర్లాయని సభకు విచ్చేసిన పలువురు అంటున్నారు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.