బిజినపల్లి, జూలై 9: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని, అదేవిధంగా వాటిని చేసిన వారిని త్వరగా గుర్తించవచ్చని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో వడ్డేమాన్ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి ఆర్థిక సాయంతో పోలీస్ శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల శాంతియుత జీవనానికి పోలీసు శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక వనరులు సమకూర్చేందుకు తాను కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ప్రజల సురక్షిత జీవనానికి పోలీస్ శాఖ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. సీసీ కెమెరాలు భద్రతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కెమెరాలు నేరాలపై పర్యవేక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజల భద్రతకు ఇది ఒక నూతన అడుగు లాంటిదన్నారు. ప్రస్తుతం మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు మహిళల రక్షణకు ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ జాం, రోడ్డుప్రమాదాలను తగ్గించడంలో కూడా ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి.
కెమెరాలు ఉండటంతో నేరస్తుల్లో భయం, ప్రజల్లో భద్రత పట్ల భరోసా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, మండల కేంద్రంలో కూడా సీసీ నెట్వర్క్ను విస్తరించాలన్నది తమ లక్ష్యం అని పేర్కొన్నారు.