కొల్లాపూర్, మార్చి 7: గుక్కెడు నీటి కోసం వారం రోజులుగా గోసపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్దిగుండం మహిళలు రోడ్డెక్కారు. కృష్ణానది కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని.. అయినపన్పటికీ పాలకులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముక్దిగుండం సమీపంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌కు ఎంజీకేఎల్ఐ మొదటి రిజర్వాయర్ నుంచి నీటిని అందజేస్తారు. అయితే గ్రామ సమీపంలో గత కొద్దిరోజులుగా పెద్ద వాగు వంతెన పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బతింటాయని తెలిసి కూడా గుత్తేదారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మిషన్ భగీరథ పైపులకు మరమ్మతులు చేయకుండా వదిలివేశారు. దీంతో ముక్డిగుండం గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది. వారం రోజులుగా నీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించడం లేదు. దీంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంట్లో వంట చేసుకునేందుకు కూడా నీళ్లు లేక పొలాల వద్ద పారే బోర్ల వద్దకు వెళ్లి నీళ్లను పట్టుకుని వస్తున్నారు. అలా నీటి కోసం వెళ్లొచ్చేసరికి కూలిపోద్దు అయిపోతుందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా నీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసహనానికి గురైన మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో శుక్రవారం నాడు ధర్నా చేశారు.
గ్రామంలో 2500 జనాభా దాకా ఉంది. గ్రామంలో రెండు మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లను అందించడంలో ఏదైనా లోపం జరిగితే గ్రామంలోని ప్రైవేటు బోర్ల నుంచి కూడా ట్యాంకులను నింపి.. గ్రామస్తులకు తాగునీటి కష్టాలు తీర్చవచ్చు. కానీ అధికారులు, ప్రభుత్వం మాత్రం ఆవైపుగా ఆలోచన చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముక్దిగుండం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని సీపీఎం మండల నాయకుడు అశోక్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. భగీరథ పైపులకు మరమ్మతులు పూర్తి చేసేందుక శ్రమిస్తున్నామని.. ముక్దిగుండం గ్రామంలో తాగునీటి సమస్యను సాయంత్రం వరకు పరిష్కరిస్తామని తెలిపారు.