సత్వర పరిష్కారం దిశగా అడుగులు
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 19: ఆమెకు అండగా ఓ సైన్యమే ఉన్నది.. ఆపదలో పరిష్కార మార్గం చూపుతున్నది. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అతివలకు రక్షణ కవచంలా నిలుస్తున్నది. షీ టీంకు ఒక్క కాల్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి బాధితులకు భరోసా కల్పిస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూరు, గద్వాల, శాంతినగర్ సర్కిల్ పరిధిలో షీటీం బృందాలు అందిస్తున్న సేవలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఈ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు కొత్తగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం ద్వారా బాధిత మహిళలు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో తమ సమస్యను షీ బృందాలకు తెలియజేసే విధంగా సౌకర్యం కల్పిస్తున్నది.
ఫిర్యాదు ఇలా..!
తమ స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటే చాలు. బాధిత మహిళలు నేరుగా షీ బృందాలకు ఫిర్యాదు చేయుచ్చు. ఆపద సమయంలో తమ ఫోన్లో పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా https://qr.ts police.gov.inఅనే లింకు వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫిర్యాదు ఫారం ఓపెన్ అవుతుంది. పేరు, ప్రాంతం తదితర వివరాలు పూరించి సబ్మిట్ చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలోని షీటీం ఐటీ విభాగానికి చేరుతుంది. అక్కడి సిబ్బంది ఆన్లైన్లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం చేరవేస్తారు. వారు తక్షణమే అక్కడికి చేరుకొని అండగా నిలుస్తారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో..
తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో ఉన్న పోస్టర్లను జిల్లాలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, సినిమా హాళ్లలో, పాఠశాలలు, కళాశాలలతోపాటు ప్రధాన కూడళ్లలోని జనసంచారం ఉన్న ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్లను అతికిస్తారు. ఆ పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే తెలంగాణ పోలీసులకు సంబంధించిన లింకు వస్తుంది. అన్ని వివరాలు గోప్యంగా ఉంచుతారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానంపై మహిళలు, బాలికలు చైతన్యం కలిగించేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
‘షీ’ కి అండగా..
పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో షీటీం కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. ఒక్క ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు. గద్వాల జిల్లాలో మార్చి 2020-2021 మార్చి వరకు 5 కేసులు నమోదు చేయగా 35మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో పరివర్తనకు కృషి చేశారు. 185 సదస్సులు ఏర్పాటు చేసి షీటీంపై ఆవగాహన కల్పించారు.
ఇవి కూడా చదవండి
నాగర్‌కర్నూల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం
కొవిడ్ వారియర్స్‌కు తాజాగా బీమా పాలసీ