Midday Meal | వెల్దండ జూన్ 23: ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్, వంట నిర్వాహకుల మధ్య వివాదం కారణంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గత రెండు రోజులుగా వంట నిర్వాహకులు మధ్యాహ్న భోజన వంటను బహిష్కరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్, వంట నిర్వాహకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పంతాలకు పోయి విద్యార్థులను పస్తులు పెట్టే స్థితికి తీసుకువచ్చారు. శనివారం, సోమవారం వంట నిర్వాహకులు వంట చేయడం బహిష్కరించారు. దీంతో ఉపాధ్యాయులు, అటెండర్ కలిసి వంట చేసి విద్యార్థులకు భోజనం అందించారు.
దీనిపై వంట నిర్వాహకులను వివరణ కోరగా.. ప్రతి సారీ చేసిన వంట బాగాలేదని రోడ్డుపై పారబోస్తానని కించపరిచే విధంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడని వంట నిర్వాహకులు తెలిపారు. వంట వదిలిపెట్టి గడ్డి పీకమంటున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్, మరో ఉపాధ్యాయురాలి టార్చర్ భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 13ఏళ్లుగా వంట చేస్తున్న నిర్వాహకులు అకస్మాత్తుగా బంద్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని, వారిని కించపరిచే విధంగా ప్రిన్సిపాల్ మాట్లాడడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.