అచ్చంపేట రూరల్, జూన్ 28 : కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, వాటికి వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శంకర్ నాయక్ కార్మికులకు పిలపునిచ్చారు. అచ్చంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్‌కు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందన్నారు. కార్మికుల సమిష్టి భేరాసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుందని, సమ్మెకు సైతం పరిమితులు ఏర్పడతాయని, ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మెలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను రెగ్యులరైజ్ చేస్తూ హెల్పర్లకు రూ.26 వేలు, టీచర్లకు రూ.32 వేలు కనీస వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. నిర్బంధ విద్యా వ్యవస్థకు ఈసీసీని లింక్ చేయరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యా నాయక్, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పార్వతమ్మ, భారతి, చంద్రకళ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జయ, చంద్రకళ, సంతూలి, రమ, పద్మ, మంగమ్మ, మేఘమాల, సంతోషి, విజయ పాల్గొన్నారు.