“ఎప్పటికప్పుడు నైపుణ్యతకు పదును పెట్టడం.. కొత్త కొత్త ఆలోచనలు చేయడం.. ప్రస్తుత సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం.. కొత్త టెక్నాలజీని అందుకుంటూ పోటీతత్వంతో నిలదొక్కుకుంటేనే విజయం సొంతం అవుతుంది”.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిచ్చింది. దీంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్నలక్ష్యంతో యువతీ యువకులు సన్నద్ధమవుతున్నారు. సర్కార్ కొలువే టార్గెట్‌గా ఉత్సాహంగా ఉద్యోగ వేటలోకి దిగుతున్నారు. పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. అనుభవం గల ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో కేంద్రాల వద్ద క్యూ నెలకొంటున్నది. కొన్ని సంస్థలు ఉచితంగా శిక్షణ అందించేందుకు ముందుకొచ్చాయి. పైసా ఖర్చు లేకుండా భోజనం పెట్టడంతోపాటు స్టడీ మెటీరియల్ అందించేందుకు సిద్ధమయ్యాయి. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్‌కు అడుగులు వేసుకోవాలని చెబుతున్నారు.
మహబూబ్‌నగర్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవ్వడంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఉద్యోగ వేటలో పడ్డారు. ఒకేసారి పెద్ద ఎత్తున వస్తున్న ఉద్యోగాల్లో తమ పేరు కూడా లిఖించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఎలాగైనా జాబ్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. భవిష్యత్తులో ఉద్యోగాల సాధన మరింత కష్టమవుతుందనే ఆలోచన నిరుద్యోగుల్లో కనిపిస్తున్నది. చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉన్నారు. అయితే, వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉచితంగా అందించే కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లే బదులు.. మనకు అందుబాటులో ఉచితంగా లభించే కోచింగ్ ప్రమాణాలు చెక్ చేసుకోవాలంటున్నారు. పైసా ఖర్చులేకుండా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తూ చక్కని స్టడీ మెటీరియల్ అందించే కోచింగ్ సెంటర్లపై ఓసారి దృష్టి సారించాలంటున్నారు. మరోవైపు గతంలో కోచింగ్ తీసుకున్న అనుభవం ఉన్నవారు.. తమకు కోచింగ్ అవసరం లేదనుకుంటే ఇంటి వద్దే ఉండి చదువుకోవడం కూడా మంచిదే. సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్‌కు దూరం ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మొబైల్ వాడినా కేవలం యూట్యూబ్ క్లాసుల కోసం లేదా గూగుల్ సందేహాల కోసం మాత్రమే వాడాలని నిరుద్యోగులకు సూచిస్తున్నారు. ఉద్యోగం కోసం ఇష్టంగా కష్టపడి చదవాలని తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం వస్తే మారే తమ తలరాతను నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నారు.
చాలా ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. అన్ని ఉద్యోగాల కోసం స న్నద్ధం అవ్వకుండా తమ సామర్థ్యం మేర కు ఏ ఉద్యోగానికి అర్హులమో ఆలోచించుకోవాలి. కోచింగ్‌కు వెళ్లినంత మాత్రాన ఉ ద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివితేనే జాబ్ వ స్తుంది. కోచింగ్ సెంటర్లలో నిత్యం దాదాపుగా 10 గంటలపాటు క్లాసులు చెబుతా రు. ఒకవేళ సబ్జెక్ట్ మీద పట్టు ఉండి.. గ తంలో కోచింగ్ తీసుకున్న అనుభవం ఉం టే సొంతంగా చదువుకోవచ్చు. ఇలా చేస్తే సమయం బాగా కలిసివస్తుం ది. ఉద్యోగం కోసం నిర్ణయించిన సిలబస్ పక్కా తెలిసిఉండాలి. తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగానే సిలబస్ ఉంటుంది. ఒకే సబ్జెక్టును రో జుల తరబడి కాకుండా.. నిత్యం కనీసం మూడు, నాలుగు సబ్జెక్టులు చ దవాలి. సిలబస్ అయిపోయేకొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రోజుకు క నీసం 12 గంటలు లేదా అంతకుమించి చదవాలి. టైంటేబుల్‌ను స్వ తహాగా తయారు చేసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నంలో సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా వల్ల సమయం వృ థా అవుతుంది. మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలు కొనొద్దు. వంద పుస్తకాలు ఒక్కసారి కాకుండా.. ఒకే పుస్తకాన్ని వంద సార్లు చదవాలి. తల్లి దండ్రుల కండ్లల్లో సంతోషం చూసేందుకు కష్టపడాలి. పోటీ ఎక్కువ ఉందని భయపడొద్దు. ఎంత ఎక్కువ చదివితే అంతగా పోటీని తట్టుకోవ చ్చు. ప్రిపరేషన్ అయిపోయాక ప్రాక్టీస్ పేపర్లు చేయాలి. మానసికంగా బలంగా ఉండాలి. జాబ్ ఎందుకు రాదు అన్న రీతిలో చదవాలి. అంకితభావంతో ప్రయత్నిస్తే ఉద్యోగం సాధించడం పెద్ద విషయమేమీ కాదు.
– జంగం విశ్వనాథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకాలజీ నిపుణుడు, పీయూ
పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేస్తున్నందున నిరుద్యోగులంతా ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే, కష్టపడి చదివిన వారికే ఉద్యోగాలు వస్తాయి. ప్రణాళికబద్ధంగా చదివే వారికి ఒకేసారి నాలుగైదు ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే, ఈ పోటీ పరీక్షల్లో కోచింగ్ పాత్ర ఎంత అనేది కూడా నిరుద్యోగులు నిర్ణయించుకోవాలి. కోచింగ్ సెంటర్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. శిక్షణ కేంద్రాల్లో కనీసం మూడు, నాలుగు రోజులు క్లాసులు విని.. అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నారో గమనించాలి. తెలిసిన వారి నుంచి కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ వివరాలను విచారణ చేసుకోవాలి. అంతా బాగుందనుకుంటేనే కోచింగ్ తీసుకోవాలి. ఎవరో తెలిసిన వాళ్లు జాయిన్ అయ్యారని.. ఏమీ విచారణ చేయకుండా చేరితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోచింగ్ కోసం రూ.8 నుంచి రూ.10వేల కంటే ఎక్కువ ఫీజు చెల్లించొద్దు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల కోసం తక్కువ ఫీజుతో సన్నద్ధం చేసే పీఈటీలు అందుబాటులో ఉన్నారు. ఉచితంగా లభించే కోచింగ్ సెంటర్లలోనూ శిక్షణ తీసుకోవచ్చు.
– రాధాసత్యం, కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు, మహబూబ్‌నగర్
సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న ఎందరో నిరుద్యోగులకు ఇవి వరంగా మారనున్నాయి. అయితే, ఉచితంగా కోచింగ్ కాబట్టి బాగా ఉంటుందో ఉండదో అనే అనుమానం అక్కర్లేదు. వీటి ఏర్పాటు సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్యాకల్టీ, మెటీరియల్ విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి మంచి కోచింగ్ లభిస్తుందనే నమ్మకం ఉంది. అవసరం అనుకుంటే ఈ సెంటర్లలో ఫ్యాకల్టీ కోచింగ్ ఇస్తున్న విధానాన్ని నాలుగైదు రోజులు చెక్ చేసుకోవాలి. వీక్లీ, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారో లేదో కూడా చూడాలి. డబ్బులు చెల్లించి తీసుకునే కోచింగ్ సెంటర్లలో అయినా ఫ్రీగా లభించే కోచింగ్ సెంటర్లలో అయినా కోచింగ్ ఫ్యాకల్టీ జీతాలు తీసుకునే పనిచేస్తారు. ఎక్కడైనా స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే, సిలబస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కూడా చూసుకొని కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఎమ్మెల్యేలు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతోపాటు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం.
– కుర్మయ్య, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ, మహబూబ్‌నగర్