నాగర్కర్నూల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ సమీపంలోని బాలాజీ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎలాంటి అంక్షలు లేకుండా రైతుల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలే ఒకరిపై మరొకరు నెపం మోపుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. పత్తి కొన్నది గోరంత, కొనాల్సింది కొండంత అన్నారు. బీఆర్ఎస్ తరఫున రైతులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.