నాగర్ కర్నూల్ ఆగస్టు, 25 : నాసిరకం ఎరువులు పంపిణీ చేశారని ఆగ్రహించిన రైతులు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. తమకు నకిలీ ఎరువులు (Fake Fertilizers) విక్రయించిన దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలకపల్లి మండలం అనంతసాగర్ (Anantasagar) గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని నాగార్జున ఫర్టిలైజర్ (Nagarjuna Fertilizer) దుకాణంలో ఎరువుల బస్తాలు కొనుగోలు చేశారు. నాణ్యమైన డిఏపీ ఎరువు అని చెప్పి ఫర్టిలైజర్ దుకాణదారులు ధర కొంచెం కూడా తగ్గించలేదు. అయితే.. తమకు నాసిరకమైన ఎరువులను అంటగట్టారని రైతులు ఆలస్యంగా గుర్తించారు.
ఆ ఎరువుల బస్తాను పొలం వద్దకు తీసుకువెళ్లి విప్పదీసి చూడగా నాసిరకం ఎరువు (Low Qulaity) ఉండడం గమనించారు. దాంతో, ఆగ్రహించిన రైతులు ఆ బస్తాలను కలెక్టరేట్‌కు తీసుకొచ్చి నిరసన తెలిపారు. సదరు దుకాణంపై ఈమధ్యే ఇలాంటి కేసు నమోదైంది. రైతులకు యూరియా బస్తాల పేరుతో పాత స్టాక్ ఎరువులను అంటగట్టినట్టినందుకు నాగార్జున ఫర్టిలైజర్ దుకాణదారులకు అధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అధికారులకు వివరణ ఇవ్వకముందే మరోసారి రైతులను మోసం చేశాడు దుకాణం యజమాని. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపామని బాధిత రైతులు వెల్లడించారు.