ఇండస్ట్రియల్ భూముల అమ్మకంపై కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. పారిశ్రామిక భూములను అమ్మేలా రూపొందించిన హిల్ట్ పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం 27ను రద్దు చేయాలని కౌన్సిల్ సమావేశంలో ఎక్స్అఫీషియో సభ్యులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద, సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు రవీందర్‌రెడ్డి, సునీత, సామల హేమ, కవితా రెడ్డి పట్టుబట్టారు. రూ. 5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపిందని ఆరోపించారు. జీవో నం 27ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని కోరగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అవకాశం ఇవ్వలేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరగడం..సభను రెండు సార్లు మేయర్ వాయిదా వేసింది.
– సిటీబ్యూరో, నవంబరు 25 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, నవంబరు 25 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి మొదట్నుంచి ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో వాటిని కొల్లగొట్టేందుకు సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందా గౌడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి అనుచరులు, సోదరులు, కుటుంబ సభ్యులకు పప్పు బెల్లంలా భూములను పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా మూసీ పరీవాహక ప్రాంతాల భూములను సేకరిస్తామని, ఆ తర్వాత ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ స్థలాలను దోచుకునేందుకు ఏకంగా ఎల్అండ్టీ ని సాగనంపిన తీరును అందరూ చూశారని అన్నారు. కంచె గచ్చిబౌలి భూములను బ్యాంకులను తనఖా పెట్టి రూ.10వేల కోట్లు దండుకున్నారన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చెర్లలో సుమారు 20వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే వాటిని రద్దు చేసి అక్కడ భూ దందాకు తెరలేపాడన్నారు. హిల్ట్ పాలసీతో కొత్త కుంభకోణానికి తెరలేపాడని వివేక్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో సుమారు 9,292 ఎకరాల భూములను రూ. 5 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ.5 లక్షలకే ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బినామీలు ఇప్పటికే భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్నర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్నారు. 22వ తేదీన జారీ చేసిన జీవో 27ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నగరాన్ని నాశనం చేస్తున్నారు : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్ నగరంలోని 22 పారిశ్రామిక వాడలో ఉన్న 9,292 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రజల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పన్నంగా అప్పజెబుతామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులమంతా ప్రశ్నించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టుకుంటూ పోతే భవిష్యత్తు తరాలు ఏం కావాలని, ప్రజా అవసరాలైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, శ్మశానవాటికలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులకు జాగా ఎక్కడ ఉంటుంది అని మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ఖజానాతో పాటు ప్రజలకు తీవ్ర నష్టమని, వెంటనే పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం నాశనం అవుతుందని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో హైదరాబాద్ నగరంలో ఒక్క పని కూడా చేయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ భూములను అమ్మడమే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నారన్నారు.
అప్పన్నంగా కట్టబెట్టారు: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం ధారాదత్తం చేస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటూ అప్పన్నంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం, ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలను వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాతనే అవకాశం ఇచ్చినట్లు సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు.
శాసనసభ, మండలిలో పోరాడుతాం
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అవినీతి కోసమే హిల్ట్ పాలసీని తీసుకువచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో పార్కులకు, డబుల్ బెడ్రూం ఇండ్లకు, శ్మశానవాటికలకు, కమ్యూనిటీ హాల్స్‌కు జాగా లేకున్నా ప్రైవేట్ వ్యక్తులకు ఇండస్ట్రియల్ భూములను అప్పజెప్పడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందని తలసాని అన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్, శాససమండలి, శాసన సభ ఇలా అన్ని వేదికలపై బీఆర్ఎస్ పోరు కొనసాగుతుందన్నారు. జీవో నం 27ను తక్షణమే రద్దు చేయాలని, అవసరమైన న్యాయస్థానాల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇండస్ట్రియల్‌కు సంబంధించి 50 శాతం స్థలాలను జీహెచ్ఎంసీకి కేటాయించి, వాటిని ప్రజా అవసరాలకు కేటాయించాలని తలసాని డిమాండ్ చేశారు.