ఎండాకాలం ఇలా మొదలైందో.. లేదో.. అప్పుడే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో ఇటు రైతులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. పదేండ్ల క్రితం పరిస్థితులు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– జయశంకర్ భూపాలపల్లి, మార్చి 15 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగానే అప్రకటిత విద్యుత్ కోత లు ప్రారంభమయ్యాయి. వ్యవసానికే కాకుం డా గృహ అవసరాలకు సైతం తిప్పలు తప్ప డం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. సమైఖ్యాం ధ్ర పాలకుల మాటలకు కేసీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. పదేళ్ల పాటు నిరంతరాయంగా ప్రజలకు, రైతులకు ఉచిత విద్యుత్ అందించారు.
కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎవుసాయానికి, ఇండ్లకు వేళాపాలా లేకుండా కరెంట్ కోతలు ప్రారంభయ్యాయి. ఎన్పీడీసీఎల్ అధికారులు మా త్రం ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం 10 గంటలైనా కరెంట్ ఉండడంలేదని, బావుల వద్ద నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామంలో రైతులు సబ్స్టేషన్ వద్ద కరెంటు కోసం నిరీక్షిస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గ్రామానికి వస్తున్నారని తెలుసుకొని నిలదీసేందుకు ప్రయత్నం చేయగా, విషయం తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. గృహాలకు సైతం ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
10 గంటలు కూడా ఉండడం లేదు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినం. అధికారంలోకి వచ్చాక రోజుకు కనీసం 10 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. నాకు ఉన్న 10 ఎకరాల భూమిలో వరి పంట వేయగా పొట్ట దశకు వచ్చింది. దీక్షకుంటలో నాలుగు నెలల నుంచి ఉదయం 11 గంటలకు కరెంట్ పోతే సాయంత్రం వరకు కూడా రావడం లేదు. దీంతో పంట మొత్తం ఎండిపోతున్నది. ప్రతిరోజు రాత్రింబవళ్లు సబ్ స్టేషన్ల వద్ద కరెంటు కోసం కావలి కాస్తున్నాం. ఈ విషయంపై విద్యుత్ అధికారులను అడిగితే ‘పైనుంచి కరెంటు రావడం లేదు.. మేం ఎలా ఇవ్వాలి’ అని అంటున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు.
-అజ్మీరా రాజునాయక్, రైతు, దీక్షకుంట
ఎండ తీవ్రత భరించలేకపోతున్నాం
వేసవికి ముం దే ఎండ తీవ్రత అధికంగా ఉన్న ది. మార్చిలోనే ఇలా ఉంటే ము న్ముందు ఎలా ఉంటదో ఊహించుకుంటేనే భయమేస్తున్నది. ఎవుసం పనులకు వెళ్లాలంటేనే వణుకు పుడుతున్నది. పనులకు వెళ్లి తొందరగా ఇంటికి వస్తున్నం. కనీసం బైక్పై వెళ్దామన్నా వడగాలులు వీస్తున్నాయి. తీరా ఇంటికి వస్తే కరెంటు ఎప్పుడు ఉంటదో.. ఎప్పుడు పోతదో తెలియడం లేదు. చెట్ల కింద కూర్చోని సేదతీరాల్సి వస్తున్నది. రాత్రి సమయాల్లో కరెంటు పోతే జాగారం చేయాల్సి వస్తున్నది.
– గండు సురేశ్, కైలాపూర్, చిట్యాల