గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. అధికార కాంగ్రెస్ పోలీసులు, మార్షల్స్‌తో పాటు మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కౌన్సిల్ సాక్షిగా ఘోరంగా అవమానించింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం సాగింది. ప్రజలు అప్పగించిన బాధ్యతయుతమైన పదవిని సమర్థవంతంగా నడిపిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్పొరేటర్లను తీవ్ర అవమానానికి గురి చేశారు.
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రెండేళ్ల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తరపున ప్రశ్నిస్తూ..15 ఏళ్ల పాటు డివిజన్ ప్రజా సేవల్లో ఉన్న వారిని హేళన చేశారు. పదేళ్ల పాటు అధికార పార్టీలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన కార్పొరేటర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అగౌరవపరిచింది. అమలు కానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, రెండేళ్ల కాలంగా హైదరాబాద్ నగరానికి నిధులు మంజూరు చేయక, అభివృద్ధి పనులు, నిర్వహణ సరిగా లేదని జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి కలిసి పలుమార్లు వినతిపత్రం సమర్పించిన గ్రేటర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ..మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 12వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానపర్చింది.
ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన ఇండస్ట్రియల్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కౌన్సిల్లో చర్చించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టుపట్టారు..కనీసం ఎక్స్అఫిషియో సభ్యులు అన్న గౌరవం లేకుండా వారికి మైక్ ఇవ్వలేదు..ఒకానొక దశలో తమ ఎక్స్అఫిషియో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కార్పొరేటర్లు మేయర్‌ను కోరుతూ పొడియం వద్దకు చేరుకున్న వారిని ఉద్దేశించి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఏకంగా తోటి కార్పొరేటర్లు అని చూడకుండా కౌన్సిల్ నుంచి బయటకు తోసేయండి అంటూ మార్షల్స్‌ను మేయర్ ఆదేశించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని గులాబీ నేతలు మండిపడ్డారు.
సంతాప తీర్మానాలు..
కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రసంగించిన తర్వాత సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆకస్మిక మరణం చెందిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రముఖ కవి అందెశ్రీ, ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్‌కు కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. అందెశ్రీ, మాగంటి గోపీనాథ్, ముజాఫర్ హుస్సేన్‌ల గురించి, వారితో తమకున్న అనుబంధాన్ని డిపూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, బొంతు శ్రీదేవి, వెంకటేశ్, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ సేవలను ఎమ్మెల్యే వివేక్ కొనియాడారు. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు మాగంటి గోపీనాథ్, అందెశ్రీ, ముజఫర్ అందెశ్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియడారు.
వాయిదాలు.. నిరసనలు
కౌన్సిల్ సమావేశం సాయంత్రం అయిదు గంటల వరకు జరిగినా మూడుసార్లు వాయిదా పడి, చివరకు ఎంఐఎం సభ్యులు మేయర్ సీటును గౌరవించటం లేదంటూ సాయంత్రం ఐదు గంటలకు నిరవధికంగా వాయిదా వేశారు. సంతాప తీర్మానాల అనంతరం సభలో గందరగోళం నెలకొనటంతో మేయర్ మరో సారి వాయిదా వేశారు. తిరిగి పది నిమిషాల్లో సభను ప్రారంభిన, ఎకువ సేపు కొనసాగించలేక భోజన విరామం ప్రకటించారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రశ్నోత్తరాల పర్వాన్ని నిర్వహించారు. సభను సజావుగా సాగేలా సహకరిస్తే కార్పొరేటర్లకు తాను ఓ బహుమతిని ప్రకటించనున్నట్లు ప్రకటించినా, ఆ సహకారం కొద్దిసేపటికే పరిమితమైంది. లంచ్ తర్వాత తిరిగి ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ప్రశ్నలను మేయర్ ప్రస్తావించారు.
రోడ్లు, శానిటేషన్ పై ఎంఐఎం సభ్యుడు సోహెల్ ఖాద్రి, కార్పొరేటర్లు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, బొంతు శ్రీదేవి, వంగ మధుసూదన్ రెడ్డి, సలీం బేగ్, సామల హేమ, వెంకటేశ్వర్ రెడ్డి, పావని, లచ్చిరెడ్డి, ఫరాజుద్దీన్, ప్రభుదాస్, సరళ, స్వామి ప్రశ్నలు సంధించారు. వీరి ప్రశ్నకు అదనపు కమిషనర్ రఘుప్రసాద్ సమాధానం చెప్పారు. మేయర్, సభ్యులు మాట్లాడుతున్నపుడు ఇతర పార్టీల సభ్యులు ఆమె, ఈమె, ఆయన, నీవు అంటూ కామెంట్ చేయటాన్ని తప్పుబడుతూ మరోసారి వాయిదా వేశారు. తిరిగి మొదలైన సభ ఎకువ సేపు కొనసాగలేదు. సభను, సీటును గౌరవించాలని మేయర్ సూచిస్తుండగానే ఎంఐఎం ఎమ్మెల్యే జుల్ఫీకర్ సీటుపై గట్టిగా కొట్టడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన మేయర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
రెండు కొత్త సంప్రదాయాలకు శ్రీకారం..
జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశ నిర్వహణలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం రెండు కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుడుతూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున మొత్తం పాలక మండలి సభ్యుల సామూహిక ఫొటో షూట్ నిర్వహించారు. ఈ ఫొటో కౌన్సిల్ హాల్ లో డిస్ ప్లే చేయటంతో ప్రతి కార్పొరేటర్ కు ఫొటోను బహూకరించాలని నిర్ణయించారు. దీంతో పాటు కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే 150 ఏళ్లు పూర్తి చేసుకుని, ప్రతి భారతీయుడిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిన వందేమాతర గీతంతో పాటు అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ.. జననీ జయకేతనం గీతాలాపనను మర్యాదపూర్వకంగా ఆలపించాలన్న రెండు కొత్త సంప్రదాయాలను మొదలుపెట్టారు. వందేమాతర గీతాలాపన కు ఎంఐఎం పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినా, అన్ని పార్టీలు అంగీకరించటంతో ఈ సంప్రదాయం మున్ముందు కొనసాగాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు. కొందరు కార్పొరేటర్లు కనీసం సీట్లో నుంచి లేచి నిలబడకపోవటం పట్ల మేయర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.
పారిశుధ్య నిర్వహణపైసభ్యులఅసహనం
పారిశుధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సభ్యులంతా ముక్తకంఠంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులంతా తమ డివిజన్లలో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై మేయర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. నగర వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య సిబ్బంది కొరత ఉండటంతో పనిభారం ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారని, చెత్త నిర్వహణ పూర్తిస్థాయిలో జరగడంలేదని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సమాధానం ఇవ్వకుండానే ముగింపు..
సమావేశంలో కార్పొరేటర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మమా అనిపించి ముగించేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కేలా మేయర్ తీరు ఉన్నదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వకుండా ఉండేందుకు బీజేపీ కార్పొరేటర్లు ఇతర విషయాలను ప్రస్తావించి సమయాన్ని వృథా చేశారు. ప్రశ్నలకు సమాధానాలిచ్చే సమయం మధ్యలో మేయర్ కావాలనే టేబుల్ అజెండాను ప్రవేశపెట్టి సభ్యులను డైవర్ట్ చేశారు. దీంతో సభ్యుల ప్రశ్నలను పక్కన పెట్టి ఎంఐఎం పార్టీ సభ్యులు మున్సిపాలిటీల విలీనంపై చర్చించాలని పట్టుపట్టారు. దీంతో మేయర్ స్ట్రాటజికల్‌గా సభను ముగించేశారు. ఎంఐఎం, కాంగ్రెస్ రహస్య ఒప్పందంతోనే ప్రశ్నోత్తారాలను అర్ధంతరంగా ముగించేసి సభ్యుల హక్కులను కాలరాశారని బీఆర్స్ సభ్యులు ఆరోపించారు. అన్ని ప్రశ్నలకు సమయం ఇస్తే అధికార కాంగ్రెస్ వైఫల్యాలు బయట పడుతాయని నామమాత్రంగా నడిపించి ముగించేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటర్లకు ఎరగా రూ.2 కోట్ల నిధులు..
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్లే లక్ష్యంగా ప్రలోభాలకు తెర తీసింది. కార్పొరేటర్లను కొనేందుకు స్కెచ్ వేసింది. రెండేండ్ల నుంచి గ్రేటర్‌ను గాలికొదిలేసి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్లు దండుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నది. డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులకు ఈ నిధులు కేటాయించేందుకు నిర్ణయించారు. అందులో రూ.కోటి కార్పొరేటర్ ప్రతిపాదించిన పనులకు, మరో రూ.కోటి జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో కార్పొరేటర్ సూచించిన పనులకు కేటాయించనున్నారు. కౌన్సిల్ బాడీ పదవీకాలం ముగిసేలోపే ఈ నిధులను మంజూరు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. అన్ని దశలు దాటుకుని నిధులు డివిజన్‌కు చేరేసరికి మళ్లీ ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేటర్లను ప్రలోభ పెట్టేందుకే నిధుల డ్రామా ఆడుతున్నదని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆరోపించారు.
వందేమాతరంపై వివాదం..
150 ఏండ్లు పూర్తైన సందర్భంగా కౌన్సిల్లో పాలకవర్గ సభ్యులు సామూహికంగా వందేమాతరం గేయం ఆలపించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేయగా, మేయర్ అనుమతించారు. ఎజెండాలో లేని అంశాన్ని కౌన్సిల్లో చేర్చడంపై తొలుత ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం పాడితేనే దేశంలో ఉండాలని కొంత మంది బీజేపీ కార్పొరేటర్లు చెప్పడంతో ఎంఐఎం సభ్యులు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో సభను వాయిదా వేశారు.
ఆనంతరం రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణను ఆలపించారు. బీజేపీ కార్పొరేటర్లు లేచి సభలో వందేమాతరం గీతాలాపన చేయాలని డిమాండ్ చేయటం, అందుకు ఎంఐఎం సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయటంతో ఉభయ పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వందేమాతర గీతాన్ని ప్రతి ఒకరూ ఆలపించి, గౌరవించాల్సిందేనని బీజేపీ సభ్యులు చేసిన కామెంట్ కు ఎంఐఎం సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీ సభ్యుల పోటాపోటీగా నినాదాలు చేస్తున్న క్రమంలో ఎంఐఎం, బీజేపీ సభ్యులు కొందరు సీట్లపైకి ఎకి నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితుల మధ్య మేయర్ సభను కాసేపు వాయిదా వేశారు.
ఆలస్యం.. ఆగమాగం
ఉదయం పదిన్నరకు ప్రారంభం కావల్సిన కౌన్సిల్ సమావేశం బీజేపీ కార్పొరేటర్ల నిరసన వల్ల అరగంట ఆలస్యంగా మొదలైంది. సభలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత, గందరగోళ వాతావరణంలో కొనసాగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన ర్యాలీని చేపట్టి జీహెచ్ఎంసీకి చేరుకున్నారు. సభ్యుల సీట్ల వద్దకు వచ్చిన మార్షల్స్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కున్నారు. ఈ క్రమంలో మార్షల్స్ , బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పదకొండు గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
పోలీసుల వలయంలో బల్దియా కార్యాలయం
సర్వసభ్య సమావేశం సందర్భంగా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇద్దరు డీఎస్పీ స్థాయి ర్యాంకు అధికారుల నేతృత్వంలో మార్షల్స్లు కలుపుకుని దాదాపు రెండు వందల మంది వరకు బందోబస్తులో పాల్గొన్నారు. కార్యాలయ ప్రవేశ ద్వారం నుంచి కౌన్సిల్ ప్రాంగణం, అందులో హాల్లో ఇద్దరు మహిళలు (సివిల్ డ్రెస్ ధరించి) మరీ బందోబస్తు నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లే టార్గెట్‌గా మార్షల్స్ కౌన్సిల్లోకి వచ్చి వారి చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను బలవంతంగా లాక్కున్నారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్ పొడియం వద్ద మూడంచెలలో మార్షల్స్ ఉండడం, సభలో దాదాపు ఐదు సార్లు మార్షల్స్ ఎంట్రీ కావడం గమనార్హం.
ఆగమేఘాల మీద మున్సిపాలిటీల విలీన ప్రతిపాదన

ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రభుత్వ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే విలీనాన్ని ఏ ప్రాతిపదికన చేపడుతారే చర్చ జరగకుండా ఆగమేఘాల మీద టేబుల్ ఐటమ్‌లో చేర్చి ఆమోదించారు. రాష్ట్ర కేబినెట్లో ఆమోదం పొందిన వెంటనే కౌన్సిల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. ఇవేమీ పట్టించుకోకుండానే రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈక్రమంలో ప్రభుత్వం పంపిన ప్రీయంబుల్ను మేయర్ ప్రకటించారు. పెరిఫెరల్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి వ్యత్యాసాలు, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఒత్తిడి అంశాలను ప్రస్తావిస్తూ మెట్రోపాలిటన్ అభివృద్ధికి విలీనం అవసరమని కౌన్సిల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. విలీన ప్రతిపాదనలో పెద్ద అంబర్‌పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బోలారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి.