నగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనంతో ఉత్కంఠ వీడింది. రెండేళ్ల కాలంగా ఉన్న విలీన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకువచ్చిన సర్కార్.. ఔటర్ వరకు విస్తరించి 2వేల చదరపు కిలోమీటర్ల విశాలమైన నగరంగా గ్రేటర్ పరిధిని ఏర్పాటు చేసింది. కోర్ సిటీ, శివారు ప్రాంతమనే తేడా లేకుండా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థలన్నీ కూడా హైదరాబాద్ మున్సిపాలిటీలోని డివిజన్లుగా మారనున్నాయి. అయితే ఔటర్ వరకు పరిధి విస్తరించినా.. పాలన వికేంద్రీకరణ కోసం విభజన కూడా జరుగుతుందా? లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ విస్తరణకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా, ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉండే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 51 శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయగా… ఇక అన్ని పురపాలికలను గ్రేటర్లో కలిపేయడంతో ఔటర్ రింగు రోడ్డు వరకు జీహెచ్ఎంసీగా మారనుంది. 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గ్రేటర్‌ను 2వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించడంతో ఇప్పుడు గ్రేటర్ జనాభా సుమారు మూడింతలు పెరగనుంది. అంటే గ్రేటర్ పరిధిలో 2కోట్ల జనాభా ఉండనుంది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ యాక్టులో సవరణలు చేసిన సర్కార్…. ఔటర్ పరిధిలో విస్తరించి ఉన్న 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలతో కలిపి మహానగర పాలికను విస్తరించింది.
దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా గ్రేటర్…!
ప్రస్తుతం విస్తీర్ణం పరంగా ఢిల్లీ, బెంగుళూరు మున్సిపాలిటీల తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. తాజా విలీనం పూర్తి అయితే ఇకపై దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా గ్రేటర్ హైదరాబాద్ మారనుంది. 1,400 చదరపు కిలోమీటర్లతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత 742 చదరపు కిలోమీటర్లతో బెంగుళూరు నగరపాలిక ఉంది. తాజాగా 27 పురపాలికలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పరిధి 2వేల చదరపు కిలోమీటర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖను ఔటర్ లోపల, ఔటర్ బయట ఉన్న ప్రాంతాలుగా విభజించి ఇద్దరు మున్సిపల్ సెక్రటరీలను నియమించింది. తాజా ఆమోదంతో గ్రేటర్‌లోనే ఔటర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు భాగం కానున్నాయి.
పెరుగనున్న డివిజన్లు, సర్కిళ్లు…
650 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో సుమారు కోటి 25లక్షల జనాభా ఉంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను కలిపివేయడంతో జనాభా మరో 75లక్షల నుంచి కోటి పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. వీటితోపాటు గ్రేటర్‌లోని డివిజన్ల సంఖ్య 180-200కు పెరిగే అవకాశం ఉందని, నియోజకవర్గాల అనుగుణంగా సర్కిళ్ల సంఖ్యను కూడా పెంచనున్నారు.
ఇప్పటికే శివారు మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న 51 గ్రామాల విలీన ప్రక్రియ ఈ ఏడాదిలోనే పూర్తిచేసింది. వీటన్నింటితో కలిపి ప్రస్తుతం డివిజన్‌కు సగటున 40వేల నుంచి 50వేల చొప్పున జనాభా ఉండగా… పెరగనున్న కొత్త పరిధితో ఒక్కో డివిజన్లో కనీసం 75వేల నుంచి లక్ష వరకు జనాభా పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అయితే పాలన సౌలభ్యం కోసమే పురపాలికల విలీనం జరుగుతుందనీ చెబుతున్నా… ఔటర్ రింగు రోడ్డు లోపలి వరకు ఒకే రూపంలో పన్ను, ఆదాయమే లక్ష్యంగా ఈ ప్రక్రియ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హద్దుల నిర్ధారణ మాత్రం 2027లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే కొత్త బల్దియా పరిధి, డివిజన్ల ఏర్పాట్లు, సర్కిళ్ల మార్పులు ఉంటాయని మున్సిపల్ వర్గాలు పేర్కొన్నాయి.

వంద శాతం పట్టణ ప్రాంతంగా మేడ్చల్…
ఔటర్‌కు సమీపంలో ఉన్న గ్రామాలను స్థానిక మున్సిపాలిటీల్లో కలిపిన సమయంలో.. మెజారిటీ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అర్బన్ ఏరియాగా మారాయి. దీంతో మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లతోపాటు, మరో 9 మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చాయి. గ్రామాల విలీన ప్రక్రియ పూర్తిచేసి ఏడాది కూడా కాకుండానే శివారులోని పురపాలికలను నేరుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం విలీనం చేస్తోంది. దీంతో వంద శాతం పట్టణ ప్రాంతంగా మేడ్చల్ జిల్లా మారిపోనుంది. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలతోపాటు, సంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో కలిపి మహా నగరం స్వరూపం ఔటర్ వరకు విస్తరించనుంది.
ఆ నగరాల్లో ఒకటే కార్పోరేషన్…
2012లో ఢిల్లీని.. నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీగా మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించారు. ఆ తర్వాత ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా మూడింటిని కలిపి ఒకే కార్పొరేషన్‌గా రూపకల్పన చేశారు. అదే తరహాలో బెంగుళూరు కార్పొరేషన్‌ను కూడా విభజన చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ అక్కడ నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితితో ఆ ప్రక్రియ మొదలు కాలేదు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాతోపాటు, హైదరాబాద్ నగరాలు మాత్రమే మొదటి నుంచి ఒకే కార్పొరేషన్‌గా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్‌ను ఒకే కార్పొరేషన్‌గా ఉంచుతుందా? లేదా? తెలియాల్సి ఉంది.
వీడని గందరగోళం..
విలీన ప్రక్రియకు తెర పడినా.. మహానగర స్వరూపంపై గందరగోళం వీడటం లేదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరాన్ని రెండు భాగాలుగా విభజన చేసి పురపాలన చేసేందుకు తొలుత కసరత్తు చేసింది. ఆ తర్వాత గ్రామాల విలీన సమయంలో నగరాన్ని నాలుగు జోన్లుగా పునర్ వ్యవస్థీకరించి ఏ జోన్‌కు ఆ జోన్ పరిధిలోనే పాలన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అసలు నగరాన్ని ఒకే గ్రేటర్ కార్పొరేషన్‌గా ఉంచుతారా? లేదా దిక్కుల వారీగా కార్పొరేషన్లుగా చేసి పాలన కొనసాగిస్తారా? అనే అంశం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. ప్రభుత్వం కూడా విలీనానికి పుల్‌స్టాప్ పెట్టింది కానీ, విభజనపై ఎలాంటి స్పష్టత లేకుండా ఉండటంతో భవిష్యత్‌లో పాలనపరమైన ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నేతల ఆశలకు గండి..!
ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలి ప్రాంత గ్రామాలన్నీ మున్సిపాలిటీలో విలీనమవనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామస్థాయి రాజకీయాలు నీరుగారిపోగా.. ఈ విలీనంతో సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే కౌన్సిలర్లు, చైర్మన్లు, డైరెకర్ల పదవులన్నీ కనుమరుగవుతాయి. వాటిస్థానంలో కార్పొరేటర్లు, మేయర్లు పాలనలోకి వస్తారు. దీంతో నేతల తలరాతలు మారనున్నాయి. ప్రస్తుతం 1,200 ఓటర్లతో ఒక మున్సిపల్ వార్డు ఉండగా, కార్పొరేషన్ ఏర్పాటైతే ఒక్కో డివిజన్ పరిధిలో సుమారు 30వేల నుంచి 40వేల మంది ఓటర్లు ఉండే అవకాశముంది. అటు.. కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగిసింది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తూ పాలన సజావుగా సాగింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీనమేషాలు లెక్కపెట్టడం మొదలైంది. ఈలోగా విలీనం అంటూ గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు లేకుండా చేశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కాలవ్యవధి మరో మూడు నెలలు ఉండగా… విభజన, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగేంత వరకు ఇప్పట్లో గ్రేటర్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇదీ చరిత్ర..
1869లో పురుడు పోసుకున్న నగరంతో గ్రేటర్‌కు బీజం పడింది. 1933లో చాదర్‌ఘాట్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ యాక్టు ప్రకారం తొలిసారి స్టాండింగ్ కమిటీని నియమించారు. దశల వారీగా శివారు ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు మున్సిపాలిటీలను కలుపుతూ 2007 నాటికి గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను కలుపుతూ ఒకే నగరంతో విస్తరించడంతో నగర స్వరూపం మారిపోయింది. విస్తృతంగా పెరిగిన జనాభాతో 2019లో పాలన వికేంద్రీకరణ కోసం జనాభా ప్రతిపాదికన నగరాన్ని ఆరు జోన్లుగా విభజన చేసి ఐఏఎస్‌లకు జోనల్ కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. ఇక అప్పటికే శివారుల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర పంచాయతీలను మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్లు నెలకొల్పి ఔటర్ పరిధిలో ఏకంగా 27 పురపాలికలు పురుడు పోసుకున్నాయి. ఇప్పుడు వీటన్నింటిని కలిపి ఒకే నగరంగా మార్చడంతో శివారు వరకు హైదరాబాద్ తరహా పాలన విధానాలు అమలులోకి రానున్నాయి.
జిల్లాల వారీగా మున్సిపాలిటీలు
మున్సిపాలిటీలు
రంగారెడ్డి : 8
మేడ్చల్ : 10
సంగారెడ్డి :2
కార్పొరేషన్లు
రంగారెడ్డి : 3
మేడ్చల్ : 4
