Ex MLA Beeram Harshavardhan Reddy | కొల్లాపూర్, ఏప్రిల్ 14 : నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ రమణ కుటుంబాన్ని ఇవాళ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. గత కొద్ది రోజులుగా రమణ తండ్రి కటిక నారాయణ అనారోగ్యంతో రామాపురం గ్రామంలోని ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం ఈ విషయం తెలుసుకొని స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ప్రతి జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మాత్రం అన్ని వర్గాల వారిని విస్మరించినట్టే జర్నలిస్టులను కూడా ఎన్నికల ముందర వాడుకొని ఇప్పుడు వదిలి వేసిందని విమర్శించారు.
ధైర్యంగా ఉండాలని.. తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని జర్నలిస్ట్ రమణకు బీరం హర్షవర్ధన్ రెడ్డి మనోధైర్యం కల్పించారు. అనంతరం ఆయన జర్నలిస్టు రమణకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే గ్రామంలో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించి వారికి మన ధైర్యాన్ని కల్పించారు. ధైర్యంగా ఉండాలని భవిష్యత్తు మనదేనని భరోసా కల్పించారు. మాజీ ఎమ్మెల్యే బీరం వెంట గ్రామ నాయకులతోపాటు కొల్లాపూర్ మండల నాయకులు ఉన్నారు.