నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉగ్రవాదుల దాడులను వ్యతిరేకిస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదుల చేసినది దుర్మార్గపు దాడి అని, సమస్త సమాజం ఈ దాడిని ఖండించాలని, ఇలాంటి విద్రోహ చర్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని, ఇలాంటి దుర్మార్గులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పొదిలి రామయ్య, గుంపల్లి అశోక్, జిల్లా నాయకులు నాగపూర్ మధు, యాదయ్య, సురేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.