Kollapur Municipality | కొల్లాపూర్, జనవరి 29 : తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ఇలాకలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోరా పరాభవం ఎదురైంది. దీంతో ఎలాగైనా మున్సిపల్ ఎన్నికలలో గెలిచేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్ని ఎన్నికల ఎత్తుగడలు వేసినా ఆశించిన ఫలితం కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ తగాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కొల్లాపూర్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ చేయి జారిపోయే అవకాశం నెలకొన్నది.
గతంలో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు కొల్లాపూర్ మార్కెట్ కమిటీని ముక్కలు ముక్కలుగా చేసి పంచిపెట్టారు. గతంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా పట్టణానికి చెందిన శ్రీదేవిని ఎంపిక చేసి మున్సిపల్ ఎన్నికలలో చైర్ పర్సన్ పదవికి పోటీ రాకుండా చెక్ పెట్టారు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం మహిళకు రిజర్వ్ కావడం, కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువ కావడంతో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.
మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం బాలస్వామి, పసుపుల నరసింహ పోటీ పడగా.. పసుపుల నరసింహకు ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు. గతంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా శ్రీదేవిని ప్రకటించి మళ్లీ ఎన్నికల కోసం మరో వ్యక్తిని ప్రకటించడంపై కొల్లాపూర్ పట్టణ ప్రజలు విస్మయానికి గురయ్యారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే పసుపుల నర్సింహ స్థానంలో మరొకరికి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రకటించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిఎత్తుగడలు వేసినా , ఎన్ని కుట్రలు చేసినా కొల్లాపూర్‌ను అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఘనమైన తీర్పు వస్తుందని కొల్లాపూర్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
