కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల (Panchayathi Elections) సందర్భంగా యువత గులాబీ జెండాకు జై కొడుతున్నారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ బలపరిచిన రామాపురం సర్పంచ్ అభ్యర్థి కొమ్మ గోపాలు, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షులు కల్మూరు నిరంజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే బీరం గులాబీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని, ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ వేస్తామని హామీ ఇచ్చారని, ఎలక్షన్స్ తర్వాత నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ అమలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత నైజాన్ని తెలుసుకున్న యువకులు గ్రామస్థాయి నుంచే తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పేందుకు ముందుకు వచ్చారన్నారు. నిరుద్యోగ యువత అధికార పార్టీ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలవబోతున్నారని వెల్లడించారు.