అమరచింత, ఏప్రిల్ 10 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కనీస సౌకర్యాలు కల్పించాలని బిజెపి మండల అధ్యక్షురాలు మంగ లావణ్య డిమాండ్ చేశారు. ప్రసవం కోసం చంద్రగట్టు గ్రామానికి చెందిన అనిత దవాఖానలో సరైన వైద్యం అందకపోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, ప్రభుత్వ దవాఖానలో కనీస సౌకర్యాలు కల్పించాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అమరచింత సీహెచ్‌సీ సెంటర్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అఫ్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి హామీ నేటికి నోచుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ఫయాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు మనోహర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బీరువా అనిల్, విష్ణువర్ధన్, అశోక్ కుమార్, ఒగ్గు రామలింగం, మంగ ఆంజనేయులు, హరికృష్ణ, ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.