Anganwadi centres | అచ్చంపేట రూరల్: ఐసీడీఎస్ పోషణ అభియాన్ పెండింగ్ నిధుల్లో కమిషన్ వసూళ్లు.. గత 2023-24 బడ్జెట్లో నిధులు విడుదల కాగా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుండి రూ. 1500 సూపర్ వైజర్లు ముందుండి వసూళ్లు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
అచ్చంపేట ఐసీడీఎస్ కు కేంద్ర ప్రభుత్వం బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం అందించే విషయంలో చైతన్యవంతం చేస్తూ అంగన్వాడి ఆహారాన్ని వర్గాల వారు తప్పక ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించే క్రమంలో సమావేశం నిర్వహించేందుకు ప్రతి సెంటర్కు ప్రతినెల రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 12 వేలు, ఆయాకు రూ. 3 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.
ఈ నేపథ్యంలో 2020 నుండి 2022 వరకు కరోనా మహమ్మారి వచ్చిన నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా నిధులు విడుదల కాలేదు. తదుపరి 2022-24 వరకు రెండు సంవత్సరాలకు సంబంధించిన మొత్తం నిధులను ఒకేసారి ప్రతి అంగన్వాడీ టీచర్ అకౌంట్లోకి గత మార్చి నెల బడ్జెట్లో విడుదల చేసింది. ఒకేసారి అంగన్వాడీ టీచర్లకు ఒక్కరికి 12 వేల చొప్పున నిధులు విడుదల కావడంతో వాటిపై సూపర్వైజర్లు తమకు కూడా వాటిలో కమిషన్ కావాలని కలెక్షన్ వసూలు చేశారు.
టీచర్ల నుండి డబ్బులు వసూలు చేసి..
ఉన్నతాధికారుల సూచనతోనే వసూళ్ల పర్వానికి తెరలేపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట ఐసీడీఎస్ క్లస్టర్లో అచ్చంపేట అమ్రాబాద్, పదర మండలాలలో కలిపి మొత్తం 195 అంగన్వాడి సెంటర్లు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లలో ఎగ్ బిర్యానీ, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కూడా టీచర్ల నుండి డబ్బులు వసూలు చేసి కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. ప్రతీ టీచర్ నుండి తప్పక డబ్బులు ఇవ్వాల్సి ఉందని చాలా ఖర్చులు ఉంటాయని, మీరు ఏ విధంగా పని చేస్తున్నారని అందరికీ తెలిసిందేనని, కావున పై అధికారి సూచనతోనే ప్రతి అంగన్వాడీ టీచర్ నుండి రూ. 1200, ప్రతి ఆయా నుండి రూ. 300 చొప్పున దాదాపు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు.
ఇటీవల పాఠశాలలో తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రతి అంగన్వాడి సెంటర్లో ఎగ్ బిర్యానీ, అక్షరాభ్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అచ్చంపేట పట్టణంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ఎగ్ బిర్యానీ, అక్షరాస్యత కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్వయంగా పాల్గొని ప్రారంభించిన సందర్భంగా తమకు ఖర్చులు ఉన్నాయని.. ప్రతి టీచర్ నుండి రూ. 500 చొప్పున వసూలు చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు సమాచారం.
మొత్తంగా సూపర్వైజర్లు అంగన్వాడి సెంటర్లలో పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉండేందుకు ఆయా సందర్భాలలో అంగన్వాడీ టీచర్లు కొంత మొత్తం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడం దారుణమైన విషయమని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కొందరు అంగన్వాడీ టీచర్లు అందుకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించినందుకే పనికట్టుకొని ఆయా సెంటర్లపై సూపర్వైజర్లు ఇతర సిబ్బంది సెంటర్లను విజిట్ చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సమాచారం.
అలాంటిదేమీ లేదు నా దృష్టికి రాలేదు : ఐసీడీఎస్ సిడిపిఓ లక్ష్మి
అచ్చంపేట ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలో దాదాపు నాలుగు లక్షలకు పైగా అంగన్వాడీ టీచర్ ఆయాలనుండి వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయాన్ని నమస్తే తెలంగాణ సోమవారం ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మి ని వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ గత మార్చి బడ్జెట్లో పోసిన అభియాన్ ద్వారా ప్రతి టీచర్ కు రూ.12 వేలు, ప్రతి ఆయాకు 3వేలు నిధులు విడుదల అయిన విషయం వాస్తవమని, వారి నుండి డబ్బులు వసూలు చేసిన విషయం తనకు తెలియదని, నా దృష్టికి రాలేదని, వాస్తవం లేదనే ఈ విషయాన్ని సూపర్వైజర్లతో చర్చిస్తానన్నారు. ఇటీవల ఎగ్ బిర్యానీ అక్షరాభ్యాసం కార్యక్రమం ఎమ్మెల్యే ప్రారంభించిన సందర్భంగా అందుకు సంబంధించిన నిధులు లేకపోవడంతో ఖర్చుల నిమిత్తం ప్రతి టీచర్ నుండి కొన్ని డబ్బులు జమ చేసి కార్యక్రమం విజయవంతం చేసిన విషయం నిజమేనని అంగీకారించారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన