ఖిలావరంగల్: మూడు తరాలుగా ఉన్న బాటను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి సాగు చేస్తుండడంతో తమ పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన 37 మంది రైతులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. వ్యవసాయ సాగుకు ఉపయోగించే ట్రాక్టర్లు, ఎడ్లు వెళ్లేందుకు దారి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లకు పైగా ఉన్న బాటను మూసివేయడం వల్ల సమయానికి పంటల సాగు చేయలేకపోతున్నామన్నారు. ఇప్పటికి మూడుసార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. పూర్వం మాదిరిగానే తమ పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.
అరి గోస పంచుకుంటున్నారు
దొడ్ల కాడికి వ్యవసాయ భూములకు వెళ్లకుండా కొంతమంది బాటను ఆక్రమించి అరి గోస పంచుకుంటు న్నారు. బాట కావాలని తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తే ఆయన కూడా రోడ్డును ఆక్రమించుకున్న వాళ్లతోటే కలిసి పోయిండు. కలెక్టర్కు మూడుసార్లు ఫిర్యాదు చేసిన సమస్యకు పరిష్కారం చూపెట్టలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలి.
– ఎల్లయ్య, రైతు, రాయపర్తి
నక్షలో ఉన్న భూమిని దున్నుకున్నారు
మూడు తంతేలనాటి బాట నక్షలో లేదు. నక్షలో ఉన్న భూమిని కొంతమంది దున్నుకొని బాట లేకుండా చేసిండ్రు. పనాది, కెనాల్ రోడ్డు, పాత నక్ష ప్రకారం బాట లేకుండా ఆరుగురు వ్యక్తులు 37 మంది రైతులను ఇబ్బంది పెడుతాండ్లు. ట్రాక్టర్లు, గొడ్లు వెళ్లకుండా చేయడంతో చాలా కష్టపడతానం. పెద్ద సార్లు స్పందించి మాకు బాట చూపెట్టాలి.
-పోగుల రాజమల్లు, రైతు, రాయపర్తి