Nagar Kurnool : అణగారిన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని, నిజమైన పేదవారినే గుర్తించాలని బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు పి.ఉషారాణి అన్నారు. బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ (BRAC-UPNRM) సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కలిసి అమ్రాబాద్, పదర మండలాల్లో అత్యంత పేద కుటుంబాల పరిస్థితిని పరిశీలించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా, అమ్రాబాద్ మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో చేపట్టిన అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న 440 కుటుంబాల గుర్తింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మల్లాపూర్ పెంట, చౌట్టిగూడెం పెంట, అమ్రాబాద్, పదరా మండలాల మహిళా సమైక్య సభ్యులతో స్మృతి శరణ్ గ్రామీణ అభివృద్ధి భారత మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలంగాణ రాష్ట్ర గ్రామీణ నిరుపేద నిర్మూలన సంస్థ డైరెక్టర్ దివ్య దేవరాజన్ లతో కలిసి కేంద్ర ప్రభుత్వ అధికారులు, సంస్థ సభ్యులు మన్ననూరు రైతు వేదికలో సమావేశమయ్యారు.
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందేలా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గత ఆరు మాసాలుగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అమ్రాబాద్, పదర మండలాల్లోని 15 గ్రామాల్లో సమైక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో గుర్తించిన 440 మంది పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు లేనివాళ్లకు వెంటనే మంజూరు చేయాలని, అధికారులే ప్రత్యేకంగా నమోదు ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
గుర్తించిన నిరుపేదలకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి రానున్న రెండు సంవత్సరాల్లోనే వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ సంతోష్ తెలిపారు.
మల్లాపూర్ పెంట చౌట్టిగూడెం పెంటలో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా డిఆర్డిఏ, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రేషన్ కార్డు లేని కుటుంబాల వివరాలను సేకరించి.. నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియను మీ సేవలో రెవిన్యూ , పౌరసరఫరాల అధికారులే చూసుకొని వెంటనే మంజూరు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. చెంచు గూడెంలోని ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, పీడీ డీఆర్డిఏ చిన్న ఓబులేసును కలెక్టర్ ఆదేశించారు. పి ఉషారాణి మాట్లాడుతూ.. నిరుపేదల అభ్యున్నతికి ప్రభుత్వ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు కృషిచేసి రానున్న 2 సంవత్సరాల్లో పేదల జీవితాల్లో పురోగతి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు.
అంతకుముందు మల్లయ్య పెంట, చౌట్టిగూడెంలను సందర్శించి అడవిలో జీవిస్తున్న చెంచుల జీవనస్థితిగతులను తెలుసుకున్నారు ఉష. అడవిలో దొరికే ఉత్పత్తుల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, డిప్యూటీ సిఈఓ గోపాల్ నాయక్, అమ్రాబాద్ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ రజిని, వివిధ శాఖల జిల్లా అధికారులు మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.