నల్లగొండ, జూన్ 17 : అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున డీఈఓ భిక్షపతికి మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో ఈవిద్యా సంవత్సరం ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలను నడుపుతూ అధిక ఫీజులు, పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు, డొనేషన్ల పేరుతో పలు యాజమాన్యాలు దోచుకుంటున్నట్లు తెలిపారు. అనుమతులు లేని పాఠశాలలను సీజ్ చేయాలని, అదేవిధంగా పాఠశాలల్లో పుస్తకాలు, డ్రెస్ లు అధిక ధరలకు అమ్మడాన్ని నియంత్రించాలని కోరారు. క్రీడా ప్రాంగణం, మౌలిక వసతులు లేని పాఠశాలలను రద్దు చేయాలన్నారు.
మౌంట్ పోర్టు, సేయింట్ ఆల్ఫోర్స్, లిటిల్ ఫ్లవర్ పాఠశాలల్లో పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకోవడం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అనుమతులు లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటున్న బ్లూబర్డ్స్, జయ, ఏకశిల, చర్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేశ్యాదవ్, దుబ్బాక రాము, నోముల క్రాంతి కుమార్, వెంకన్న, రాజు, శివకుమార్, హరిశంకర్ గౌడ్ పాల్గొన్నారు.