రామవరం, జూన్ 17 : గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసి లో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా డివైజిఎం పర్సనల్ మోహన్ రావు కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్ సంజీవ్, హైట్ శివ,జెట్టి మోహన్,రవి గౌడ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకుడు ఆల్బర్ట్, హెచ్ఎంఎస్ నాయకుడు గడపల్లి కృష్ణ ప్రసాద్, సీఐటీయూ భూక్యా రమేష్, ఐఎఫ్టీయూ నాయకుడు గౌని నాగేశ్వర్ రావు, బీఎంఎస్ రఘు ప్రసంగించారు. ఎన్నో ఏండ్లుగా సింగరేణి ఆనవాయితీ ప్రకారం కంపెనీ వారే ఇంటర్వ్యూలు, బయోడేటాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తారు కానీ, కొత్తగా వచ్చిన సౌదా కంపెనీ ప్రైవేట్ ఏజెన్సీ లాగా కొత్తగూడెంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ పేరుతో నియామకాల ప్రక్రియ మొదలుపెట్టిందని, దీనిని తక్షణమే నిలిపివేయాలన్నారు.
మొదటిగా సౌదా కంపెనీ ఆఫీస్ మేనేన్మెంట్కు వినతిపత్రం రూపంలో అన్ని కార్మిక సంఘాలు తెలియజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే నేడు సింగరేణి కొత్తగూడెం జీఎం కార్యాలయం ముందు డీవైజీఎంకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే ఈ సౌదా ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని వీటి వల్ల స్థానికంగా ఉంటున్న 600 కార్మిక కుటుంబాలు జీవన ఉపాధి కోల్పోతాయని తెలిపారు. సింగరేణి ఓసీ కోసం 600 కుటుంబాలు భూములను, ఇండ్లను, బతుకుతెరువును కోల్పోయి సింగరేణి లాభాలపేక్ష కోసం వారు నిర్వాసితులుగా మారారన్నారు.
అన్ని కోల్పోయి జీవనోపాధితో ఆ ఓసీలలో బ్రతుకుతెరువు కొనసాగిస్తున్నారు కానీ నేడు సౌదా కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్ ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి 600 స్థానిక కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కావునా ఈ సౌదా నిర్వహిస్తున్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని లేకపోతే దశల వారి ఆందోళన చేయాలసి వస్తుందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు చిన్ని, వాసు, ఆంజనేయులు, రామ్ చందర్, యాకయ్య, అశోక్, నాగయ్య, శ్రీను, రవి, మాధవరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.