కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎన్నో దశాబ్దాల పాటు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడుపట్టాలు ఇవ్వడంతో గిరిజనుల జీవితాలలో వెలుగులు వికసించాయని ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఆయన మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ గేమ్యా నాయక్ తండా ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ తిరుపతి నాయక్ లతో కలిసి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పోడు వ్యవసాయం తప్ప మరో మార్గం లేని ముక్డిగుండం, అమరగిరి, మొలచింతలపల్లి, గేమ్యా నాయక్ తండా తదితర తండాలు చెంచుగూడాల గిరిజనులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటారన్నారు.
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చొరవతో కొల్లాపూర్ పరిధిలో 404 మంది పోడు రైతులకు 1081.26 ఎకరాల భూమికి పోడుపట్టాలిచ్చినట్లు తెలిపారు. పోడు భూములకు పట్టాలు లేని సమయంలో నిత్యం ఫారెస్ట్ అధికారుల దాడులతో గిరిజనులకు భారీ ఎత్తున నష్టం జరిగేదన్నారు. అప్పులు తెచ్చుకొని సాగు చేస్తున్న పంటలను గతంలో ధ్వంసం చేసేవారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు పోడు భూములకు పట్టాలు రావడంతో రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అందుకు ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అని వారు పేర్కొన్నారు. పోడు పట్టాల ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి లబ్ధిదారుడు స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.