అచ్చంపేట : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో బల్ముల నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా చిత్తశుద్ధి లేదని, బడ్జెట్లో కేటాయించిన నిధుల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని అన్నారు. విద్యారంగాన్ని సర్కారు పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని, ప్రస్తుత బడ్జెట్లో మాత్రం ఆ మేరకు నిధులు కేటాయించలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.57% నిధులు కేటాయిస్తున్నారని బలుముల చెప్పారు. రాష్ట్రంలోని ఉన్నత విశ్వవిద్యాలయాలకు తగినంత నిధులు కేటాయించకపోవడం, పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజుల రీయంబర్స్ మెంట్స్ గురించి ఎలాంటి ప్రస్థావన లేకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కస్తూర్బా విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజనం పథకానికి, డిగ్రీ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, సొంత భవనాల కోసం నిధులు కేటాయించకపోవడం లాంటి పరిణామాలు విద్య అభివృద్ధికి కాకుండా, విద్య దారిద్య్రానికి దారితీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి 30% అధిక నిధులు కేటాయించి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నవీన్, ప్రవీణ్, శ్రావణ్, అపజిత్, కృష్ణ, కార్తీక్, హనుమంతు, అంజి తదితులు పాల్గొన్నారు.