నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : జిల్లా దవాఖానగా మారిన నాగర్‌కర్నూల్‌లో స్పెషలిస్టు వైద్యులు ఫుల్‌గా ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలు ఉన్నా యి. 2016లో జిల్లాగా ఏర్పడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరియా దవాఖాన స్థాయిని 330 పడకలకు పెంచి జిల్లా వైద్యశాలగా మా ర్చింది. దీంతో రోజురోజుకూ ఇక్కడికి వైద్యం కోసం వచ్చే పేదల సంఖ్య పె రుగుతూనే వస్తుండగా.. అదే స్థాయిలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దీం తో ఆశించిన మేర పేదలకు వైద్య సేవలు అందడం లేదన్న అపవాదు మూటగట్టుకున్నది.
ఓపీ కోసం రోగులకు కష్టాలే..
నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖాన నాలుగు నియోజకవర్గాల్లో ని ముఖ్యంగా నల్లమల చెంచులు, ఇతర పేదలకు ప్రాణాలు పోసే ఆలయం. ఈ దవాఖాన జిల్లాస్థాయికి మారి ప్రత్యేక వై ద్యనిపుణులు వచ్చి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం 70 మంది వరకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు, 343 మంది నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో గ తంలో 600 నుంచి 700 వరకు ఉన్న ఓపీ ఇప్పుడు 1000కి దాటుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం దవాఖానలో అందుతు న్న సేవలు, వచ్చే ఓపీకి భవనం సరిపోవడం లేదు.
ఓపీ ఎంట్రీ చేయించుకోవాలంటే రోగులకు కష్టాలు తప్పడం లేదు. పెద్ద సంఖ్యలో బారులుదీరి పేర్లు నమోదు చేయించుకునేందుకు గుమికూడుతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఓపీ రా యించుకోవడం సమస్యగా మారింది. ఇక మంగళ, బుధవారాల్లో స్కానింగ్‌లు, పరీక్షల కోసం వచ్చే గర్భిణులు సైతం ఇ క్కట్లు పడుతున్నారు. దవాఖాన ఆవరణలో స్కానింగ్‌కు పేర్లు నమోదు చేయించుకుంటున్నారు.
ఇక దవాఖానలో శానిటేషన్ ఏజెన్సీదారు సరిగ్గా వేతనాలు ఇవ్వకపోవడం, కోర్టులో ఏజెన్సీ వ్యవహారం ఉండటంతో పారిశుధ్య సిబ్బంది తరచూ ఆందోళనల బాట పడుతున్నారు. అదనపు బెడ్ల కోసం లేఖలు రాస్తూ రాగా ఇటీవలే ప్రభుత్వం 5 బెడ్లకు అదనంగా మరో 5 బెడ్లను మం జూరు చేసింది. మంచాలతోపాటు పరికరాలనూ సిద్ధంగా ఉం చారు. ప్రారంభం కోసం ప్రజాప్రతినిధుల సమయం కోసం వైద్యాధికారులు ఎదురు చూస్తున్నారు. దవాఖానలో కొన్ని రో జుల్లో రోగుల సంఖ్య తక్కువగా ఉంటుండగా ఒక్కోసారి అధిక సంఖ్యలో వస్తున్నారు.
ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అప్పుడు అందరికీ మంచాలు అందించలేకపోతున్నారు. వంద మంది రోగుల్లో సాధారణంగా 50 మంది వరకు ఇన్ పేషెంట్లుగా ఉంటున్నా రు. ఇటీవలి వర్షాకాలంలో అధికంగా డయేరియా, డెంగీ, వై రల్ ఫీవర్, కుక్క, పాము కాట్లకు చికిత్స కోసం వస్తున్నారు. దవాఖానలో ఐసీయూ కేంద్రంలో రాత్రివేళ వచ్చే అత్యవసర చికిత్స బాధితులను అధికంగా రెఫరల్ పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక దవాఖాన ముఖద్వారంగా కనిపించే లిఫ్ట్ దిష్టిబొమ్మలా మారింది. లిఫ్ట్ ఉందన్నది అలంకారప్రాయంగా మారింది. రెండో అంతస్తుకు వెళ్లేందుకు రోగు లు, వృద్ధులు మెట్లు ఎక్కుతున్నారు. వైద్యులు ఐదు రోజులకు మందులు రాసిస్తే ఫార్మసీలో మాత్రం ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రలనే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘స్టాక్ లేదు.. మళ్లీ రేపు రండి ఇస్తాం’ అం టున్నారని రోగులు వాపోతున్నారు. ఈ సమస్యలు తీరాలంటే నూతన భవనం నిర్మించాల్సి ఉంది.
కేసీఆర్ ప్రభుత్వంలో నూతన భవనం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నూతన భవనం కోసం నిధు లు మంజూరుకాగా గత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చొరవతో మెడికల్ కాలేజీ నిర్మాణం, దవాఖానకు స్థల సేకరణ జరిగింది. అయితే ఇప్పటికీ నూతన భవన పనులు ముందుకు కదలడంలేదు. ఈ దవాఖాన స్థాయిని 600 పడకలకు పెంచుతున్నట్లుగా తాజా ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి చేసిన ప్రకటన జీవో రావాల్సి ఉన్నది.
ప్రస్తుతం దవాఖానకు వస్తున్న రోగులు, అందే వైద్యానికి నూతన ఆధునిక భవనం కావాల్సి ఉన్నది. అలాగే వైద్యశా ల అభివృద్ధి కమిటీ కొన్నేళ్ల నుంచి ఏర్పాటు చేయలేదు. ఈ క మిటీ ఉంటే దవాఖానలో సమస్యలను చర్చించి, పరిష్కారం కో సం చర్యలకు ఆస్కారం ఉండేది. దీనివల్ల పూర్తిస్థాయిలో వైద్యాధికారులపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైంది. ఇక్కడ సమస్యలను బయటకు రాకుండా చూస్తారన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.
సరైన వైద్యమందేలా చర్యలు..
నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు వచ్చే రో గులందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించే లా చర్యలు తీసుకుంటాం. సీటీ స్కాన్, ఐదు కొత్త డయాలసిస్ బెడ్లను త్వరలో ప్రారంభింపజేస్తాం. మందుల కొరత లేదు. డాక్టర్ బదిలీ పై వెళ్లడంతో ఒక్క ఆప్తాలమిక్ సేవలు తప్పా అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నాం. వై ద్యులు, సిబ్బంది రోగులతో మంచిగా వ్యవహరించడంతోపాటు సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాను.. లిఫ్ట్, ఆక్సిజన్ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్, ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తున్నాం.
– డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖాన
నిరుపయోగంగా యంత్రాలు
దవాఖానలో అధునాతన సీటీ స్కానింగ్ యంత్రం వచ్చి నెలలు గడుస్తున్నా టెక్నీషియన్ రాక సేవలు ప్రారంభించలేదు. ఆరేండ్లుగా డయాలసిస్ కేంద్రం నడుస్తోంది. దవాఖాన థియేటర్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కరోనా సమయంలో రూ.లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. అయితే, జిల్లా దవాఖానకు లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్ కావాల్సి ఉన్నది. దీనికోసం వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపారు.