Nagarkurnool | తిమ్మాజిపేట, జూన్ 10 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో, ఇంటి నిర్మాణం సందర్భంగా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండలంలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవంగా జీవించేందుకు ఇల్లు అవసరమని, ఇందుకోసం నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇంటి కోసం రూ. 5 లక్షలు ఇస్తుందన్నారు. ఇందులో దళారుల ప్రమేయం లేదని, నేరుగా వారి ఖాతాలోనే డబ్బులు పడతాయని తెలిపారు. డబ్బుల కోసం ఎవరైనా వస్తే వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. మొదటి విడతతో పాటు మరో రెండు విడతల్లో ఇండ్లను ఇస్తామని తెలిపారు.
తిమ్మాజిపేటకు మొదటి విడతలో 510 ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, మీ ఆశీర్వాదం కావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఎంపీడీవో లక్ష్మీదేవి, నాయకులు వెంకటరామిరెడ్డి, దానం బాలరాజ్, శ్రీనివాస్, ముబారక్, భాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్, వివేక్ రెడ్డి, గిరిజ శంకర్ రైతులు పాల్గొన్నారు.