మహబూబ్‌నగర్, మే 3 : ఈనెల 16న ప్రపంచ దేశాల నుంచి పాలమూరు జిల్లా పర్యటనకు 22 మంది సుందరీమణుల వస్తున్నారని జోగుళాంబ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరి పర్యటన నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పిల్లలమర్రిని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 700 ఏండ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని సుందరీమణులు వీక్షించడానికి వస్తున్నారని తెలిపారు.
ఆరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ సుందరీమణుల రాష్ర్టానికి వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా డీజీపీ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే పర్యాటకులు హుందాగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని, పోలీసుల సూచనలు పాటించాలన్నారు. చిన్న పొరపాటు జరిగినా అది మన ప్రాంతానికి, రాష్ర్టానికి, దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో సీఐ గాంధీ నాయక్, ట్రాఫిక్ సీఐ భగవంత్‌రెడ్డి, ఎస్సై విజయ్ పాల్గొన్నారు.