తాడూరు, మే 1 : విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన తాడూరు మండలంలోని తుమ్మలసూగూరులో గురువారం ఉ దయం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలసూగూరు గ్రామానికి చెందిన శ్రీనివాసాచారి కుమారుడు అయిన శ్రీకాంత్(16) ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న పిండిగిర్నిని ఆన్‌చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో శ్రీకాంత్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా గమనించిన తల్లి జయమ్మ(42)కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు.
ఈ సమయంలో జయమ్మ కూతురు పక్కనే ఉన్నప్పటికీ ఏం చేయాలో పాలుపోక వెంటనే విద్యుత్ సరఫరా అయ్యే స్విచ్‌ను ఆపివేసింది. వెంటనే వారి వద్దకు వెళ్లి చూసి అంబులెన్స్‌కు సమాచారవివ్వగా అంబులెన్స్ వచ్చేలోపే జయమ్మ మృతి చెందగా శ్రీకాంత్ కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. జయమ్మ మృతదేహంతోపాటు శ్రీకాంత్‌ను 108లో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు.
శ్రీనివాసాచారి కూలినాలీ చేస్తూ కుటుంబాన్ని వెల్లదీస్తుండగా జయమ్మ ఇంటి వద్దనే ఉంటూ టైలర్ పని చేస్తూ పిండిగిర్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించేదని సమాచారం. జయమ్మ భర్త శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే విద్యుదాఘాతంతో మృతి చెందిన జయమ్మ, శ్రీకాంత్ భౌతికకాయాలను ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.