మహబూబ్‌నగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి.. చేతికొచ్చి పంటలు నీటిపాలయ్యాయి.. వరి కంకులు నేలకొరిగాయి.. కల్లాల్లోంచి మొక్కజొన్న కొట్టుకుపోయింది.. మొంథా తుఫాన్ రైతుల కండ్లల్లో నీళ్లు తెచ్చింది.. అన్నదాతను నిండా ముంచింది.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మోతమోగించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల తుఫాన్ బీభత్సం సృష్టించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు మత్తడి దుంకాయి. వాగులు, వంకలు ఉధృతంగా పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రోడ్లు, కాలనీలు కుంటలను తలపించాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో శ్రీశైలం డ్యాం సైట్ వద్ద లింగాల గట్టు వద్ద, అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఆలయం వద్దకు భక్తులను అనుమతించడం లేదు. తెలంగాణ వైపునకు వెళ్లాల్సిన వాహనాలు గంటల తరబడి కదలకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సున్నిపెంట సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో క్రేన్ సాయంతో బండరాళ్లను తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొండలపై నుంచి జలపాతం కనువిందు చేస్తున్నది. దుం దుభీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పాలమూరు, నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లో, వనపర్తి ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. చెరువులు, కుంటలు, వాగులు ఉధృతిని ఆయా జిల్లాల ఎస్పీలు, అధికారులు పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
శ్రీశైలం-మహబూబ్‌నగర్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రవాహం కొనసాగింది. లింగాల మండలంలోని అవుసలికుంట-అంబటిపల్లి గ్రామాల మధ్య వాగులో కారు చిక్కుకున్నది. స్థానికులు కారులోని వ్యక్తిని తాడు సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చంద్రవాగు ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం-మహబూబ్‌నగర్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రవాహం కొనసాగింది. అచ్చంపేట మండలంలో నాటిన ఈత మొక్కలు కొట్టుకుపోయాయి. కాల్వలు, కల్వర్టులకు గండ్లు పడగా.. రోడ్లు కోతకు గురికాగా.. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో, చారకొండ మండలం తుర్కలపల్లిలో లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి.
పలు ఇండ్లల్లోకి నీరు వచ్చి చేరగా.. బయటకు ఎత్తిపోసుకున్నారు. అచ్చంపేట మండలం మార్లపాడు తండా నక్కలగండి రిజర్వాయర్‌లోకి నీళ్లు పునరావస తండాను చుట్టుముట్టాయి. ఇళ్లల్లోకి మోకాల్లోతు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన తాసీల్దార్ సైదులు, పోలీసులు వెళ్లి తండాలోని 100 ఇండ్లల్లో ఉన్న 200 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పశువులు, మేకలు, ఇంటిసామగ్రిని వదిలి బరువెక్కిన గుండెతో అక్కడి నుంచి తరలిరాగా.. వారిని అధికారులు కేశ్యతండాకు చేర్చారు. దుందుభీ పరవళ్లు తొక్కుతూ ప్రమాదకరంగా పారింది.
మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి స్వయంగా చెరువు పరిసర ప్రాంతాలు, మహబూబ్‌నగర్‌లోని పలు చోట్లను పరిశీలించారు. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సూచించారు. కరెంట్ స్తంభాలు, తీగలను తాకవద్దన్నారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న హాజీపూర్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. డిండి వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.