వడ్డేపల్లి, ఫిబ్రవరి 6 : బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని, మన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి శాంతినగర్‌లో శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అన్ని అక్రమాలే ఉన్నాయని, ఇసుక, మొరం, పైరవీలు, అక్రమ బదిలీలు ఇలా అనేక విషయాలు మీరు చూస్తున్నారని అలాంటి కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ భవిష్యత్ శూన్యం అవుతుందని అన్నారు.
ఎమ్మెల్యే విజేయుడుని నిస్వార్థంగా ప్రజల కోసమే పనిచేస్తున్నాడని మచ్చలేని నాయకుడని అన్నారు. అలాగే మున్సిపాలిటీలో కొత్త పార్టీ, కొత్త గుర్తుతో వచ్చేవాళ్లను నమ్మొద్దని అన్నారు. చైర్పర్సన్ అభ్యర్థి భార్గవ్‌తో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లను గెలిపించుకుందామని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమాయ్యయని అడగాలని ప్రజలకు సూచించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, పింఛన్ రూ.4వేలు ఇస్తామని మోసం చేసిన వారికి ఓటు వేయొద్దని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజేయుడు, నాయకులు గడ్డం శ్రీను, కిశోర్, మాజీ చైర్పర్సన్ కరుణ, సూరి, లక్ష్మీకాంతారెడ్డి, బాబీ, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.