అయిజ, నవంబర్ 28 : మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పట్టణంలోని హైలెవల్ వంతెన కారణంగా ధ్వంసమైన మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొత్త గా నిర్మించగా.. గురువారం ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూరాల నుంచి వచ్చే మిషన్ భగీరథ నీటిని ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా పట్టణంలోని అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులను నింపి పట్టణంలోని నల్లాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ హయాంలోనే ఇంటింటికీ నల్లాలను బిగించి నీటిని అందిస్తున్నామన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం క లుగకుండా అందించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసి పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దేవన్న, ఇన్చార్జి కమిషనర్ రాజయ్య, మున్సిపల్ ఏఈ రాజశేఖర్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు రంగారెడ్డి, నర్సింహారెడ్డి, మహబూబ్, బీఆర్ఎస్వీ నాయకుడు వీరేశ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.