జడ్చర్ల, జూన్ 18 : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల మంచినీటి సమస్యలను శాశ్వతంగా పోగొట్టేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రజలకు మంచినీటి సమస్యలు లేకుండా చేశారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని పందిరిగుట్ట వద్ద మంచినీళ్ల పండుగను నిర్వహించారు. ఈ మంచినీళ్ల పండుగలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోపాటు అడ్డాకుల, భూత్పూర్ మండల ప్రజాప్రతినిధులతో కలిసి మిషన్ భగీరథ నీటిశుద్ది కేంద్రాన్ని పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి జడ్చర్ల పందిరిగుట్టకు వచ్చే నీటిని ఏరోవేటర్ వద్ద పరిశీలించారు. అక్కడి నుంచి ఆనీళ్లు ఎలా ఫిల్టర్ అవుతాయో చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మిషన్‌భగీరథ అధికారులు సన్మానించారు. అదేవిధంగా సర్పంచులను, అధికారులను శాలువాలతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఏగ్రామానికి వెళ్లినా మంచినీటి సమస్యలే ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటికీ మంచినీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రూ.500వందల కోట్లతో జడ్చర్ల నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మెయిన్పైప్లైన్ను దాదాపు 933కిలోమీటర్ల పైప్‌లైన్ వేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గ్రామాలు, పట్టణాలకు 653కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి నీటిసరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో అవినీతి జరిగిందని అంటున్న కాంగ్రెస్ నాయకులు గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క చిత్తూరు జిల్లాకు మంచినీటి కోసం రూ.8వేల కోట్లకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు.
అలా అయితే తెలంగాణలోని 10జిల్లాలకు రూ.80వేలకోట్లు అయ్యేవన్నారు. కాని కేవలం రూ.45వేల కోట్లతోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈపథకాన్ని పూర్తి చేశామన్నారు. అంతకుముందు జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్‌ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన 3ఎంఎల్డీ పైప్‌లైన్‌ను సంబంధించిన గేట్‌వాల్వ్‌ను తిప్పి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దీంతో జడ్చర్ల పట్టణానికి రోజు సరఫరా అయ్యే 7ఎంఎల్డీ వాటర్‌కు అదనంగా 3ఎంఎల్డీ వాటర్ సరఫరా కానున్నదన్నారు. జడ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన నీటిశుద్ది కేంద్రం నుంచి మొత్తం 400వందల గ్రామాలకు మంచినీటి సరఫరా అవుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, జెడ్పీటీసీలు మోహన్‌నాయక్, విద్యాసాగర్, ఎంపీపీలు నాగార్జునరెడ్డి, సుశీల, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నవనీతకొండల్, సర్పంచులు ప్రణీల్‌చందర్, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మిషన్‌భగీరథ డిప్యూటీ ఈఈ రవిచంద్ర, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవోలు జగదీశ్, అనురాధ, ఏఈ మొగులాల్, నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.