ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఓ బూటకమని, మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాంగ్రెసోళ్లు కుల, బీజేపోళ్లు మత రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో, శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. నేడు ప్రజల్లోకి వచ్చి సురభి నాటకాలు వేసే వారిని మించి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మీరు చేసుకునే సంబురాలు 3వ తేదీ ఉదయం 8 గంటల వరకు మాత్రమేనని, 9 గంటల తర్వాత బీఆర్ఎస్ సంబురాలు ప్రారంభం కావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 1 : ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఓ బూటకమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లు కుల, బీజేపోళ్లు మత రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. కేవలం 30రోజులు వారు నటించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారని, ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. అప్పుడే ఓడిపోతాం అంటే వెనుకున్న వారే కరవవుతారని, మాయమాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. కాం గ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముందు బెంగుళూర్లో ఉం చేందుకు వారు ప్లాన్ చేయడం వెనుక ఉన్న అర్థం ఎటు వైపు దారితీస్తుందన్నారు. వారికి వారే ఒక దగ్గర కూర్చొని లేనిపోని మాటలు మాట్లాడి జనంలోకి వెళ్లేలా చేశారని ఇది ఎంతో మోసపూరితమైన నాటకం ఆడారని ఆరోపించారు. సురభి నాటకాలు వేసే వారి కంటే కాంగ్రెసోళ్లు చేసిన నాటకాలు బా గున్నాయని ఎద్దేవా చేశారు. రైతులకు మంచి చేయాలనే తపనతో రైతుబంధు పెడితే ఆ డబ్బులను కూడా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు రైతులకు ఎందుకు అని మాట్లాడుతున్నారని, పది మంది సీఎంలమంటు కాంగ్రెసోళ్లు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారని, వారి చేతిలో తెలంగాణ ఉండదని, నూరుకు నూరుశాతం బీఆర్ఎస్ అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. వాళ్ల వెంబడి ఉన్న వారే బీఆర్ఎస్కు ఓటు వేశామని చెప్పారని, కారు గుర్తు చూస్తే ఏ గుర్తు గుర్తుకు రాదన్నారు.
ఈ నెల 3వ తేదీన 8 గంటలలోపు కాంగ్రెస్ పార్టీ వారు సంబురాలు చేసుకునేందుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు. వారు చేసుకునేవి, సంబుర పడుతున్నవి కేవలం కల్పితమైనవని, మేం ఈ నెల 3వ తేదీన 9గంటల తరువాత నిజమైన సంబురాలు చేసుకుంటామని చెప్పారు. కిరాయి ముఠాలతో కాంగ్రెస్ పార్టీ వారు బూటకపు రాజకీయం చేశారని, అది ఎంతో కాలం నిలవదన్నారు. మాకు సర్వేలు ఉన్నాయని, మంచి మెజార్టీ రావడం ఖాయమన్నారు. హంగ్‌కు చాన్స్‌లేదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 2018ఎన్నికల్లోను కూడా ఇలాగే అన్నారని, చూస్తే మైండ్‌బ్లాక్ అయ్యేలా బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. గిప్పుడు కూడా రాసిపెట్టుకుని చూడండి 71 నుంచి 81 సీట్లు బీఆర్ఎస్కు రావడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గొర్రెల కాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.