రైతులంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ అని, అందుకే వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశంలోనే ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. బుధవారం పాలమూరు, ఎదిరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు.
పాలమూరు, మే 3 : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ సర్కార్ మీకు అండగా నిలిచిందన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పట్టణ మహిళా సమాఖ్య, ఎదిరలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులంటే ప్రేమ ఉన్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సైతం మనలాంటి రైతు బాగు కోసం చేపట్టిన పనులు లేవన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, రైతు కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు వంటివి బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు జరిపి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు.. వచ్చాక రైతుల జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పులను గమనించాలని సూచించారు. ధాన్యం కొనుగోలును మహిళా సంఘాలు చైతన్యవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి త్వరలో కాల్వల నుంచి సాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా ఇన్చార్జి చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ జరీనాబేగం, కౌన్సిలర్ యాదమ్మ హనుమంతు, వార్డు అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు రాజేశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళతో ఆప్యాయంగా..
పాలమూరు, మే 3 : మహబూబ్‌నగర్ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను లక్ష్మమ్మ అనే మహిళ ఆప్యాయంగా పలకరించింది. అయితే ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అని మంత్రి అడగగా.. నాకేమీ లేవని, మీ చల్లని పలకరింపే చాలని చెప్పింది. వేలాది మంది రైతులకు ఉపయోగపడేలా, వందలాది కూలీలకు ఉపాధినిచ్చేలా మార్కెట్‌ను తీర్చిదిద్దారన్నారు. మార్కెట్లో తమలాంటి వారికెందరికో ఉపాధి లభిస్తుందన్నారు. తాను మూడు సార్లు అనారోగ్యం బారిన పడితే అండగా నిలబడడంతో తాను బాగయ్యానని మంత్రికి సంతోషంగా వివరించింది. డబుల్ బెడ్రూం ఇంటితోపాటు పింఛన్ ఇస్తున్నారని సంబురపడింది.
క్రీడాకారిణికి అండగా..
మహబూబ్‌నగర్ టౌన్, మే 3 : జిల్లాలోని ధర్మాపూర్ సమీపంలో ఉన్న ఎస్టీ గురుకులంలో 9వ తరగతి చదువుతున్న కే.తులసీ అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. వచ్చే నెలలో తైవాన్‌లో జరిగే పోటీకి వెళ్లేందుకుగానూ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయగా.. వచ్చే నెల 12న అపాయింట్మెంట్ వచ్చింది. కానీ ఆమె తైవాన్ వెళ్లాల్సిన విమానం 10వ తేదీన ఉన్నదని ఆందోళన చెందుతుండగా.. ఆమె తండ్రి కిషన్ బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి విషయం తెలిపాడు. వెంటనే స్పందించిన మంత్రి పాస్‌పోర్ట్ త్వరగా వచ్చి పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురుకులాలో చదువుతూ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తులసీని మంత్రి అభినందించారు. ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. తైవాన్‌కు వెళ్లే అవకాశం రావడంతో మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.