కొల్లాపూర్, సెప్టెంబర్ 15 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మన బతుకులు బాగుపడుతాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌లో శనివారం పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం కొల్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద సామర్థ్యం ఉన్న మోటర్లను ఈ ప్రాజెక్టులో వినియోగించి ఈ ప్రాంత కరువును ముఖ్యమంత్రి పారదోలుతున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావడంతో ఊహించని అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. దుబాయ్, ముంబయి, పుణె నుంచి ఈ కార్యక్రమాన్ని చూసేందుకు జనాలు తరలివస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు అభిలాష్‌రావు, నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.