అమ్రాబాద్, మే 30 : కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.3.49కోట్ల చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వలతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకముందు శ్రీశైల మల్లన్నను దర్శించుకొని మన్ననూర్‌కు వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే, ఎంపీ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. మన్ననూర్ నుంచి ప్రశాంత్‌నగర్ కాలనీకి రూ.కోటీ 97లక్షలతో బీటీ రోడ్డు, రూ.కోటితో సీసీ రోడ్లు, రూ.12లక్షలతో మైనార్టీల శ్మశానవాటిక ప్రహరీకి భూమిపూజ చేసి ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతూ.. దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ఇది మింగుడు పడని కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. సోయి లేని ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో అలివికాని హామీలిస్తాయని.. వాటిని ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్యే బాలరాజు పట్టుదల గల వ్యక్తి అని.. అటువంటి నాయకుడిని ప్రజలు మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెంచులు విల్లు, బాణాలను, మేదరి సంఘం నేతలు బుట్టలు, యాదవులు గొర్రెపిల్లను అందజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నేతలు నరేశ్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, సర్పంచులు శ్రీరామ్‌నాయక్, శారద, పెద్దిరాజు, తాసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్, బీఆర్ఎస్ నేతలు రవీందర్‌రెడ్డి, చెన్నకేశవులు, కార్యకర్తలు పాల్గొన్నారు.