‘అచ్చంపేటను కృష్ణాజలాలు ముద్దాడనున్నాయి. రూ.2,300 కోట్లతో మంజూరు చేసిన ఉమామహేశ్వర లిఫ్ట్ పనులను త్వరలో ప్రారంభించుకుందాం. ఎత్తిపోతల పనులు పూర్తయితే నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయి. పంటలు సస్యశ్యామలం కానున్నాయి. భూసేకరణ, నష్టపరిహారం విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తా. దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే.’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అచ్చంపేట పట్టణంలో రూ.20 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖాన, 150 డబుల్ బెడ్రూం ఇండ్లను మంగళవారం ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహి రంగ సభలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్‌ది జలదృశ్యం.. విపక్షాలది ఆత్మహత్య సదృశ్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్, బీజేపీకి భయం పట్టుకున్నదన్నారు. బీజేపీలో చేరేవాళ్లే లేరని ఆ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడే చెప్పాడన్నారు. కాంగ్రెసోళ్లు పదవుల గురించి తప్పా ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ వంటి నాయకుడు భూతద్దం పెట్టి వెతికినా దొరకరన్నారు.
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట, మే 30 : రూ.2,300 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంజూరు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తె లిపారు. ఈ ఎత్తిపోతలను త్వరలో ప్రారంభించి వే గంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రూ.20 కోట్లతో నిర్మించిన వం ద పడకల దవాఖాన, 150 డబుల్ బెడ్రూం ఇం డ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే పట్టణంలోని ఎన్టీఆర్, ఇండోర్ స్టేడియాల పెండింగ్ పను లు, మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ అభివృద్ధి కరదీపికలు ఆవిష్కరణ, సీసీరోడ్లు, సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు అచ్చంపేట వై రోడ్ నుంచి బైక్‌పై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తె లియజేసేందుకు నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆంజనేయస్వామి ప్రాజెక్టు, మన నిరంజన్‌షావలీ లిఫ్ట్‌ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఇంత పెద్ద సభ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. త్వరలో ఈ ఎత్తిపోతలను ప్రారంభించి కృష్ణా జలాలు అచ్చంపేట ను ముద్దాడేలా చే స్తామన్నారు. దీంతో ని యోజకవర్గ రూపురేఖలు మారిపోనున్నాయని తెలిపా రు. ప్రభుత్వ విప్ గువ్వల పట్టువదలని విక్రమార్కుడిలా సాధించారన్నారు. అచ్చంపేటకు సాగునీళ్లు ఎ వరు తెచ్చిండ్రు అంటే కేసీఆర్ ఇచ్చిండు.. గువ్వల బాలరాజు తెచ్చిండు అంటారు. ఇంతకంటే గొప్ప అవకాశం ఉంటదా? ఎమ్మెల్యే కోరినట్లు భూసేకరణ, నష్టపరిహారం విషయంలో రైతులకు మంచి డబ్బులు వచ్చేలా.. త్వరగా విడుదలయ్యేలా నా సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అయితుందంటే, కల్వకుర్తి పూ ర్తయిందంటే, ఎంజీకేఎల్ఐ ద్వారా అచ్చంపేట, ఉ ప్పునుంతలకు ప్యాకేజీ 30 ఎక్స్టెన్షన్ పథకం వ చ్చిందంటే భీమా, నెట్టెంపాడు, కాళేశ్వరం పూర్తయిందంటే కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాంగ్రెస్ ఈ పాలమూరు జిల్లాకు ఏమైనా వచ్చిందంటే కరువును ఇచ్చింది.. వలసలను ఇచ్చింది.. కరువు తప్పా తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి.. 10లక్షల మంది వలసపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్‌తోనే జలదృశ్యం
రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉంటేనే ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీరు జలసవ్వళ్లతో జలదృశ్యం ఆవిష్కృతం అవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మితే అది ఆత్మహత్యా సదృశ్యం అయితదన్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలి.. కానేకాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్.. కానేకాదన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా పట్టువదలని విక్రమార్కుడిలాగా రాత్రింబవళ్లు కష్టపడి.. కోర్టుల్లో కేసులు వేసినా.. గ్రీన్ ట్రిబ్యునల్‌లో అడ్డంకులు పెట్టినా.. భూసేకరణను ఆపినా.. కాని ఆయన చేసే పనిలో నిజాయితీ ఉంది గనుక ప్రజల కోసం కేసీఆర్ చేస్తున్నాడని చెప్పారు. అచ్చంపేట ప్రజలు ఆలోచించాలి.. వంద పడకల దవాఖాన సీఎం కేసీఆర్ లేకుంటే వచ్చేదా..? అని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య చూస్తే ఏప్రిల్ నెలలో తెలంగాణలో 70 శాతం డెలివరీలు జరిగాయన్నారు. కాంగ్రెస్ హయంలో కేవలం 30 శాతమే అన్నారు. 30 శాతం కూడా డబ్బున్న వారే ప్రైవేటు దవాఖానకు పోతున్నారని తెలిపారు. మన పథకాలు చూసినా మిగితా రాష్ర్టాల వారు మన పథకాలను అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాలను కోరుతున్నారని తెలిపారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల.. నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు కావాలని, ఎస్ఎల్బీసీలో భూ పరిహారం చెల్లించాలని.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోటా పెంచాలని కోరారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆరునెలలకు ఎలక్షన్లు ఉన్నాయి.. కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు బయలెల్లిన్రు.. బీజేపోళ్లయితే నిన్నోకాయన చెప్పిండు.. బీజేపీని తెలంగాణలో ఎవరూ నమ్ముతలేడని నేను చెప్తలేను.. బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులేత్తేసిండన్నారు. ఆయన చెప్పేదంత వేదాంతం.. చేసేందంత రాద్ధాంతం అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నా.. అచ్చంపేట ఎత్తిపోతల పథకం త్వరగా జరగాలన్నా అది కేసీఆర్‌తోనే.. బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
తెలంగాణ షాన్ సచివాలయం
కేసీఆర్ అద్భుతంగా నిర్మించిన తెలంగాణకు షాన్ సచివాలయం అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలు గర్వపడేలా సెక్రటేరియట్ కట్టిండు.. ప్రజల కోసం పరిపాలనా సౌలభ్యం కోసం కడితే ఒకడు కూలగొడ్తా అంటాడు.. మరొకడు పేల్చేస్తా అంటడు.. మనకు ఎవరు కావాలే.. తెలంగాణకు కట్టేటోడు కావాల్నా? కూలగొట్టేటోడు కావాల్నా? అని ప్రశ్నించారు. ఇటుక ఇటుక పెట్టి ఈ తెలంగాణను నిర్మించేటోడు కావాలే.. అది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్షాల గ్లోబల్ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
బీఆర్ఎస్ పేరింటేనే భయం
బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే బీజేపోళ్లకు భయం పట్టుకుంది.. కాంగ్రెసోళ్లకు కలవరం పట్టుకుంటున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాలకు ఒకటే పని సీఎం కేసీఆర్ అస్తమానం తిట్టడం.. ఇందుకోసం ఒకరి కంటే ఒకరు పోటీ పడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేలా ఆశీర్వదించాలని కోరారు. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజును లక్ష మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
సాగునీళ్లు తెచ్చి రుణం తీర్చుకుంటా
అచ్చంపేట, మే 30: తనకు రాజకీయ జన్మనచ్చిన అచ్చంపేట రైతులకు తన ప్రాణాన్ని ఫణంగా పట్టైనా సాగునీరు తెచ్చి.. వారి రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట సాగునీటి పథకానికి ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వానికి అచ్చంపేట రైతుల పక్షాన ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో గువ్వల ప్రసంగించారు. రూ.2,300కోట్లతో అచ్చంపేటకు ఉమామహేశ్వర, నిరంజన్‌షావలీ, మద్దిమడుగు అంజన్న, చెన్నకేశవస్వామి రిజర్వాయర్లకు మంత్రి మండలి ఆమోద ముద్రవేసి టెండర్ దశలో ఉన్నందునా సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అచ్చంపేటలో ప్రాజెక్టులను ఆపి రైతులకు నష్టం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా.. కాలువల వెంట తిరిగి భూములు కోల్పోతున్న రైతుల కాళ్లకు దండం పెట్టి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అచ్చంపేట ప్రజల కాళ్లను కృష్ణమ్మ జలాలతో కడిగి తన జన్మకు సార్థకత చేసుకుంటానని ప్రకటించారు. ప్రతిపక్షాలు సోషల్‌మీడియాలో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పైశాచిక అనందం పొందుతున్నారని విమర్శించారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు తమకు పూర్తి సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న వారికి పరిహారం, గృహలక్ష్మి పథకం ద్వారా 6వేలు ఇండ్లు మంజూరు చేయాలని, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశాలని మంత్రిని కోరారు. రూ.2,500కోట్లు అచ్చంపేట గడ్డకు తీసుకొచ్చానని వివరించారు.
ఆకట్టుకున్న సాయిచంద్ ఆటాపాట
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ పాటల రూపంలో వివరించారు. హరితహరం వల్ల తెలంగాణ పచ్చబడిందన్నారు. అచ్చంపేటలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు రూ. 2,300 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, వైస్‌చైర్మన్ బాలాజీసింగ్, షాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పెటీసీలు మంత్రియా, రాంబాబు, కౌన్సిలర్ మన్నుపటేల్, శివ తదితరులు ప్రసంగించారు. ఎంపీపీ శాంతాబాయి, మున్సిపల్ వైస్‌చైర్మన్ శైలజ, మాజీ చైర్మన్ తులసీరాంతోపాటు అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలొచ్చారు.
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ఎన్టీఆర్, ఇండోర్ స్టేడియాల్లో పెండింగ్ పనులు, డబుల్బెడ్రూం ఇండ్లు, వంద పడకల దవాఖాన, మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ అభివృద్ధి కరదీపికల ఆవిష్కరణ, సీసీరోడ్లు, సబ్‌స్టేషన్ తదితర 12 అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు అచ్చంపేట వై రోడ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
మరింత అభివృద్ధి చేస్తాం
గువ్వలతో కలిసి అచ్చంపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ రాములు అన్నారు. సీఎం కేసీఆర్ అచ్చంపేట ప్రాజెక్టులను క్యాబినెట్లో ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. పనులను అడ్డుకునే దుష్టశక్తులను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వలసలు కొనసాగుతున్నాయన్నారు. ఇద్దరి మధ్య కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని.. వాటిని పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. అచ్చంపేటకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు కింద పరిహారం అందించాలని మంత్రిని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ కశిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. సభకు తరలొచ్చిన జనాన్ని చూశాక.. అచ్చంపేటలో మూడోసారి కూడా గులాబీ జెండా ఎగురడం ఖాయమైందన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేకు తోడుగా ఉండడం అచ్చంపేట ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు.