అలంపూర్, జూలై 6 : నడిగడ్డలో ఎప్పుడు.. ఏ ఎన్నికలొచ్చిన ఎమ్మెల్సీ చల్లా నేతృత్వంలో అంతిమ విజయం బీఆర్ఎస్దే ఉంటుందని, ఈ విషయం పార్టీ ముఖ్యలు కేసీఆర్, కేటీఆర్కు తెలుసునని బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తా ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మెట్టు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ సర్ ప్రోగ్రాం నిర్వహణ, బీఎల్వో బాధ్యత, ఓటరు నమోదు ప్రక్రియ, ముసాయిదా జాబితా విడుదల, అభ్యంతరాలు తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ ప్రోగ్రామ్లో మనం డూప్లికెట్ ఓటర్లను, మృతి చెందిన ఓటర్లను తొలగించుకోకపోతే రానున్న ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని గుర్తు చేశారు.
పార్టీ శ్రేణులు బీఎల్వోలతో పాటు ఇంటింటికీ తిరిగి ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంను పకడ్బందీగా చేపట్టాలన్నారు. బీఎల్వోలు ఏదైనా పొరపాటు చేస్తే సరిచేయించే హక్కు బీఎల్ఏలకు ఉంటుందన్నారు. సర్ ప్రక్రియ నిర్వహించిన ఇతర రాష్ర్టాల్లో అధికార పార్టీయో ఎక్కువ లబ్ధ్ది పొందాయనే ఆరోపణలు లేకపోలేదన్నారు. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు సర్ ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా పాల్గొనే హక్కు కల్పించిందన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ వల్ల సాధించిన ఈ సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా నిక్కచ్చిగా చేయిస్తు, బీఆర్ఎస్ పార్టీపై అభిమానం ఉన్న నూతన యువ ఓటర్ల నమోదును మాత్రం మరువకూడదన్నారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేపట్టే పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై కార్యకర్తలు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. పార్టీ అభిమానులు సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మాటలు, అమలుకు చేతకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. తాగునీరు, సాగునీటి విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధ్ది లేకుండా వ్యవహరిస్తుందన్నారు. ఈ సంవత్సరం అత్యల్ప వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వ్యవసాయం కోసం మనకు కెనాల్ ద్వారా నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైతులు అనుకూలమైన పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నడిగడ్డలో ప్రాంతంలో యువ నేత చల్లా వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సర్ అవగాహన కార్యక్రమం, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేయడంతోపాటు సర్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.