– మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
– పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాచలం ప్రాంతానికి ముంపు
ఖమ్మం, ఆగస్టు 01 : భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న గోదావరి వరద ఉద్ధృతి సహజ పరిస్థితుల వల్ల మాత్రమే కాదని, దిగువన ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం కూడా ప్రధాన కారణమని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భద్రాచలం, దాని పరిసర గ్రామాల్లో ముంపు సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని, వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పోలవరం ముంపు సమస్యపై తాను మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తొలి నుండి నిరంతరం పోరాటం చేశానని తెలిపారు.
గతంలో అనేక వేదికలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా గళం వినిపించానని గుర్తు చేశారు. భద్రాచలం ప్రాంత ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీపడదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలు నెట్టేసుకునే ధోరణిని విడనాడి, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహించి, భద్రాచలం పరిసర ప్రాంతాలకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదల సమయంలో తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితం కాకుండా, భవిష్యత్‌లో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు.