భూత్పూర్, జూలై 24 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో భూత్పూర్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని ఆయన కోరారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500, వృద్ధాప్య పింఛన్లు రూ.4000లకు పెంచుతానని చెప్పడం, రైతుభరోసా ఎకరాకు రూ.10వేల నుంచి 15 వేలకు పెంచుతానని చెప్పడం, రైతుభరోసా రెండు పంటలకు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు పంటలకు బదులుగా మూడు పంటలకు ఇస్తానని చెప్పడం, కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఇచ్చిన హామీలలో ఏది ఇవ్వలేదని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలను చూస్తూ విసిగిపోయారని, దీనిని మన కార్యకర్తలు అవకాశంగా మార్చుకోవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల అసత్య ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా కార్యకర్తల మధ్య సమన్వయలోపం ఉండరాదని, అందరూ సమిష్టిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, చంద్రమౌళి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, నర్సింహాగౌడ్, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, సాయిలు, వెంకట్రాములు, నరేశ్‌గౌడ్, బాలస్వామి, మందడి సరోజ్‌రెడ్డి, ఆల శ్రీకాంత్‌రెడ్డి, గడ్డం ప్రేమ్, రామురాథోడ్, అహ్మద్, సాధిక్, యాసిన్ పాల్గొన్నారు.